హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) వెలుపల నిర్మించ తలపెట్టిన రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్)లో దక్షిణ భాగం భూసేకరణ కోసం అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ధరలను సవరించే అధికారాన్ని కలెక్టర్లకు కల్పించారు. ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఆ భాగంలో భూములు కో ల్పోతున్నవారికి బహిరంగ మార్కెట్ ధరల ప్రకారం నష్టపరిహారం లభించే అవకాశం ఉంటుంది.
ట్రిపుల్ఆర్ దక్షిణ భాగం పనులను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో, ఉత్తర భాగం పనులను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్నారు. ఉత్తర భాగం నిర్మాణానికి అవసరమైన భూముల్లో ఇప్పటికే 90 % వరకు సేకరించారు. ఇప్పుడు దక్షిణ భాగం రహదారి కోసం భూముల ధరలను సవరిస్తే ఉత్తర భాగంలో భూములు కోల్పోయినవారు కూడా తమకు సవరించిన ధరల ప్రకారం నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేసే అవకాశం ఉన్నది.
ట్రిపుల్ఆర్ ప్రాజెక్టు డైరెక్టర్ (పీడీ)గా రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి దాసరి హరిచందనను నియమిస్తూ సోమవారం ప్రభు త్వం ఉత్తర్వులు జారీచేసింది. దక్షిణ భాగం నిర్మాణానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) తయారీతోపాటు పీఎం యూ, టెక్నికల్, ఫైనాన్షియల్, ట్రాన్సాక్షన్ అ డ్వైజరీ కోసం కన్సల్టెంట్ నియామకానికి ప్రతిపాదనలను ఆహ్వానించేందుకు ప్రభుత్వం ఆర్అండ్బీ చీఫ్ ఇంజినీర్‌కు అనుమతి ఇచ్చింది.
ట్రిపుల్ఆర్ దక్షిణ భాగం ప్రాజెక్టు అమలు కోసం పీడీ ఆధ్వర్యంలో నలుగురు సభ్యులతో ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ యూనిట్ (పీఐయూ)ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మరో ఉత్తర్వు జారీచేసింది. ఈ యూనిట్లో ఎన్విరాన్మెంట్ అనలిస్టుగా జిల్లా అటవీ అధికారిని, టెక్నికల్ అనలిస్టులుగా ఆర్అండ్బీ శాఖకు చెందిన ఒక చీఫ్ ఇంజినీర్, ఇద్దరు సహాయక ఇంజినీర్లను, అడ్మినిస్ట్రేషన్ విభాగం అకౌంటెంట్‌గా ఆర్థిక శాఖ అధికారిని డిప్యుటేషన్‌పై నియమించారు. ప్రాజెక్టు పూర్తయ్యేవరకు ఈ విభాగం పనిచేస్తుందని ప్రభుత్వం పేర్కొన్నది.
ట్రిపుల్ఆర్ దక్షిణ భాగాన్ని ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే తరహాలో 6/8 లేన్లతో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. సచివాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. దక్షిణ భాగం నిర్మాణంతో రాష్ట్ర ప్ర భుత్వం నిర్మిస్తున్న ఫోర్త్ సిటీకి, ఎయిర్పోర్ట్ కు కనెక్టివిటీ ఏర్పడుతుందని, దీంతో ఆయా ప్రాంతాల్లో సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, లాజిస్టిక్స్, మాన్యుఫ్యాక్చరింగ్, రియల్ ఎస్టేట్ రంగాలు అభివృద్ధి చెందుతాయని వివరించారు.
అన్నీ అనుకున్నట్టు జరిగితే ట్రిపుల్ఆర్ నిర్మాణానికి వచ్చే నెలలోనే టెండర్లు పిలుస్తామని, ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులను సమకూర్చుకునేందుకు ప్రపంచ బ్యాంకు, జైకా, ఏడిబీ (ఆసియా అభివృద్ధి బ్యాంకు) తదితర ఆర్ధిక సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు పనులను డిసెంబర్ మొదటి వారంలోగా పూర్తిచేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.