అచ్చంపేట, సెప్టెంబర్ 26 : అచ్చంపేటలో ఈ నెల 28న నిర్వహించే జనగర్జనకు రైతులు, ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. వర్షాలు కురిసినా.. పిడుగులు పడినా.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభ మాత్రం ఆగదని స్పష్టంచేశారు. శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని నేషనల్ హోటల్ వెనుక మైదానంలో సభా ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాగర్‌కర్నూల్, అచ్చంపేట నియోజకవర్గాల ఇన్చార్జి మర్రి జనార్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, బీఆర్ఎస్ నేతలతో కలిసి ఆయన పరిశీలించారు.
వాన కురిసినా ఇబ్బంది లేకుండా సభావేదిక సిద్ధం చేయగా.. స్ధానిక సీనియర్ నేత పోకల మనోహర్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహగౌడ్, అమీనొద్దీన్, మాజీ ఎంపీపీలు కర్ణాకర్‌రావు, పర్వతాలు ఇతర నేతలతో ఏర్పాట్లు, జన సమీకరణ తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మీడియాతో శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ఆదివారం కేటీఆర్ సభ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరగనున్నదని తెలిపారు. సభకు నల్లమల ప్రజలు, రైతులతోపాటు అన్ని రంగాల వారు తరలిరావడానికి ఉత్సాహంగా ఉన్నారని తెలిపారు. ప్రజావ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వంపై నల్లమల గర్జన నుంచి తిరుగుబాటు పోరాటం ప్రారంభిస్తున్నామని చెప్పారు. హైకోర్టు ఆదేశించినా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే పరిస్ధితిలో ప్రభుత్వం కనిపించడం లేదని విమర్శించారు. ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చి సభను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు.
ప్రజాభిప్రాయంతోనే ట్రిపుల్ఆర్ నిర్మించాలి
ప్రజాభిప్రాయం మేరకే ట్రిపుల్ఆర్ నిర్మించాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్, మర్రి జనార్దన్‌రెడ్డితో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. పాత ఆలైన్మెంట్ ప్రకారం నిర్మిస్తే 600 మంది రైతులు మాత్రమే నష్టపోయేవారని, రాష్ట్ర సర్కార్ ఇటీవల మార్చిన ట్రిపుల్ఆర్ ఆలైన్మెంట్తో భూమిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న 1700 మంది చిన్న, సన్నకారు రైతుల కుటుంబాలు రోడ్డున పడుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఇప్పటికే ఉద్యోగ, నిరుద్యోగ వర్గాలు తిరగబడుతున్నారాని రానున్న రోజుల్లో అన్ని వర్గాల వారు తిరగబడే రోజులు దగ్గరపడ్డాయని చెప్పారు.