CAG | హైదరాబాద్, మార్చి 27 ( నమస్తే తెలంగాణ ) : కాంగ్రెస్ కపట నాటకం మరోసారి బట్టబయలైంది. కేసీఆర్ పాలనలో చేసిన అప్పుల మీద కాంగ్రెస్ చెప్పేవన్నీ తప్పుడు లెకలేనని మరోసారి తేలిపోయింది. స్వయంగా ప్రభుత్వమే అసెంబ్లీ సాక్షిగా ఈ గణాంకాలను బయట పెట్టుకున్నది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత కంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్ (కాగ్) ఇచ్చిన నివేదికను ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార సహా కాంగ్రెస్ నేతలంతా తప్పుడు ప్రచారం చేస్తున్నారని నివేదిక నిగ్గు తేల్చింది. రాష్ట్రం అప్పుల కుప్ప అయ్యిందంటూ ఎన్నికలకు ముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ నేతలంతా చేస్తున్నది దుష్ప్రచారమే అని కుండబద్దలు కొట్టింది. లెకలతో సహా చెంప ఛల్లుమనిపించేలా సమాధానమిచ్చింది. రాష్ట్రానికి వచ్చే ఆదాయమంతా అప్పులు కట్టడానికే సరిపోతున్నదంటూ సీఎం రేవంత్రెడ్డి చేస్తున్న ప్రచారం బూటకమేనని తేల్చేసింది. తమ పాలనలో రాష్ట్ర ఆదాయం పడిపోతే.. దానిని కప్పిపుచ్చుకునేందుకే ‘కడుపు కట్టుకొని పనిచేస్తున్నాం’ అంటూ బీద అరుపులు అరుస్తున్నదని స్పష్టమైంది.
కేసీఆర్ పాలనలో రాష్ట్రంపై ఏడు లక్షల కోట్ల అప్పు అని కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ చేస్తున్నదంతా దుష్ప్రచారమని కాగ్ నివేదిక తేల్చి చెప్పింది. 2024 మార్చి 31 నాటికి తెలంగాణ మొత్తం అప్పులు రూ.5,17,659 కోట్లుగా పేరొన్నది. ఇది రాష్ట్ర జీఎస్డీపీలో 34.47 శాతం. ఇందులో రూ.3,96,715 కోట్లు బడ్జెట్ రుణాలు అని, రాష్ట్ర ప్రభుత్వ హామీల కింద కార్పొరేషన్లు, స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) ద్వారా రూ.1,20,944 కోట్లు సమీకరించినట్టు వెల్లడించింది. ఇందులో.. తెలంగాణ ఏర్పడే నాటికే ఉమ్మడి రాష్ట్రం నుంచి వారసత్వంగా వచ్చిన అప్పు రూ.72 వేల కోట్లు. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2024 మార్చి వరకు చేసిన అప్పులు రూ. 15 వేల కోట్లు. ఇదే సమయంలో చేసిన బడ్జెటేతర రుణాలు రూ. 11 వేల కోట్లు. అంటే మొత్తం రూ. 98 వేల కోట్లు. మొత్తం అప్పుల నుంచి వీటిని మినహాయిస్తే.. కేసీఆర్ పదేండ్ల పాలనలో చేసిన అప్పు రూ.4,19,659 కోట్లే అని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కరోనా విపత్తు సమయంలో రాష్ట్రాలు భారీగా ఆదాయం కోల్పోయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 2020-22 మధ్య ప్రత్యేక రుణాలు మంజూరు చేసింది. ఇందులో తెలంగాణకు రూ.6,949 కోట్లు కేటాయించింది. వీటిని ఈ అప్పుల నుంచి మినహాయిస్తున్నట్టు కాగ్ వెల్లడించింది. ఒకవేళ వీటిని కూడా కలుపుకున్నా కేసీఆర్ పాలనలో చేసిన అప్పు రూ.4,26,608 లక్షల కోట్లే అని స్పష్టమవుతున్నది.. దీనినిబట్టి రాష్ట్రంపై ఏడు లక్షల కోట్ల అప్పు మోపారని సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార, ఇతర మంత్రులు చేస్తున్నదంతా పచ్చి అబద్ధమని తేలిపోయిందని ఆర్థిక నిపుణులు పేరొంటున్నారు. బహిరంగ సభల్లో, అసెంబ్లీలో, సన్మాన, సతార సభలు.. ఇలా సందర్భం వచ్చిన ప్రతి చోట కాంగ్రెస్ నేతలు చేసిన దుష్ప్రచారానికి ఇప్పుడేం సమాధానం చెప్తారని ప్రశ్నిస్తున్నారు.
‘గత ప్రభుత్వం మాపై అప్పుల కుప్ప మోపింది. ప్రతి నెల ఒకటో తారీకు నాడు రూ.6500 కోట్లు అసలు, మిత్తి రూ.6500 కోట్లు కట్టాల్సి వస్తున్నది. రాష్ట్రానికి వచ్చే ఆదాయం అంతా అప్పులు కట్టడానికే సరిపోతున్నది’ అంటూ సీఎం రేవంత్రెడ్డి తరచూ చెప్తుంటారు. అయితే ఇదంతా అసత్య ప్రచారమని కాగ్ స్పష్టం చేసింది. కాగ్ నివేదిక ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం కిస్తీలు, మిత్తీలకు చెల్లించిన మొత్తం రూ.53,978 కోట్లు. ఇందులో బడ్జెట్ రుణాల చెల్లింపు రూ.32,939 కోట్లు కాగా, బడ్జెటేతర రుణాలు రూ.21,039 కోట్లు చెల్లించినట్టు వెల్లడించింది. చెల్లించిన మొత్తంలో అసలు రూ.21,058 కోట్లు కాగా వడ్డీ రూ.32,920 కోట్లు. ఈ లెకన రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల అసలు, వడ్డీ కలిపి 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రతినెల రూ.4,498 కోట్లు మాత్రమే చెల్లించింది. 2024-25 సంవత్సరంలోనూ బడ్జెట్ రుణాల చెల్లింపు రూ.33 వేలకోట్లే అని నివేదిక స్పష్టం చేసింది. ఈ లెకన బడ్జెట్, బడ్జెటేతర రుణాలు కలిపినా.. ప్రభుత్వం నెలకు రూ. 5000 కోట్ల వరకు చెల్లించే అవకాశం ఉన్నట్టు ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ నేతలు ఒక రూపాయి కట్టి మూడు రూపాయలు కట్టినట్టుగా ప్రజలను మభ్య పెట్టారని మండిపడుతున్నారు.
వాస్తవానికి ప్రభుత్వాలకు అప్పులు వారసత్వంగా వస్తాయని.. ఒక ప్రభుత్వం చేసే అప్పులు మరొక ప్రభుత్వం చెల్లిస్తుందని నిపుణులు చెప్తున్నారు. ప్రభుత్వాలు పాత అప్పులు చెల్లిస్తూనే కొత్త అప్పులు చేస్తుంటాయని, ఇందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నర పాలనలో చేసిన రూ.1.58 లక్షల కోట్ల అప్పులే ఉదాహరణ అని పేరొన్నారు. తెలంగాణ ఏర్పడే నాటికి ఉమ్మడి రాష్ట్రం నుంచి వారసత్వంగా 72 వేల కోట్ల రుణ భారం ఉన్నదని గుర్తు చేస్తున్నారు. నాటి బడ్జెట్ లక్ష కోట్లు అని, అంటే బడ్జెట్తో పోలిస్తే 72 శాతం అప్పుల భారం ఉన్నట్టు పేరొన్నారు. వాటిని కేసీఆర్ ప్రభుత్వం చెల్లించిందని చెప్పారు. ఇక కాగ్ గణాంకాల ప్రకారమే.. 2014-15 నుండి 2023-24 నాటికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2.34 లక్షల కోట్ల అప్పులు చెల్లించిందని తెలిపారు. కానీ వీటిని కాంగ్రెస్ ప్రభుత్వం ఎకడా చెప్పకుండా.. కేవలం అప్పుల కుప్ప మోపిందంటూ ప్రచారం చేస్తున్నదని మండిపడుతున్నారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న అప్పులను రాష్ట్ర అభివృద్ధి కోసమే వెచ్చించినట్టు కాగ్ నివేదిక స్పష్టం చేసింది. తెచ్చిన అప్పులను మూలధన వ్యయంగా ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల కల్పనపై పెట్టుబడిగా పెట్టిందని వెల్లడించింది. 2019-20, 2023-24 మధ్య తీసుకున్న నిధులలో 80 శాతానికి పైగా మూలధన వ్యయంగా పెట్టినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2023-24లో మొత్తం రూ. 50,528 కోట్ల రుణం తీసుకోగా అందులో 87 శాతం.. అంటే రూ.43,918 కోట్లు మూలధన వ్యయం కోసం ఉపయోగించినట్టు నివేదిక వివరించింది.
కేసీఆర్ ప్రభుత్వం మూలధన వ్యయంతో భారీ గా పెట్టుబడులు పెట్టడం వల్ల సొంతరాబడులు గణనీయంగా పెరిగినట్టు కాగ్ నివేదిక స్పష్టం చేస్తున్నది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.67,597 కోట్లుగా ఉన్న రాష్ట్ర సొంత పన్ను ఆదాయం 2022-23 నాటికి రూ.1,06,949 కోట్లకు పెరిగింది. ఈ వాస్తవాన్ని దాచిపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తున్నదని నిపుణులు మండిపడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో వేగంగా పెరిగిన సొంత పనుల ఆదాయ వృద్ధి.. కాంగ్రెస్ వచ్చాక తర్వాత తగ్గింది. కేసీఆర్ పాలనలో రెవెన్యూ వసూళ్లు స్థిరమైన వృద్ధిని నమోదు చేశాయని, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా రూ.15,988 కోట్ల నుంచి రూ.23,742 కోట్లకు పెరిగిందని వెల్లడించింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న అసమర్థ, అసంబద్ధ నిర్ణయాల ఫలితంగా మొదటిరోజు నుంచే రాష్ట్ర ఆదాయంపై దెబ్బ పడింది. అధికారంలోకి రాగానే ఫార్మాసిటీని రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది, మూసీ పునర్జీవ ప్రాజెక్టును తెరమీదికి తెచ్చింది. దీంతో రియల్ ఎస్టేట్ రంగం ఒకసారిగా ఒడిదుడుకులకు లోనైందని నిపుణులు చెప్తున్నారు. ఈ ప్రభావం మిగతా రంగాలపై పడటంతో.. రాష్ట్ర ఆదాయం తగ్గినట్టు పేరొంటున్నారు. ఫలితంగా 2023- 24లో రెవెన్యూ వసూళ్లు రూ.1.69 లక్షల కోట్లకే పరిమితమైనట్టు పేరొంటున్నారు. వాస్తవానికి అదనంగా కనీసం రూ.20-30 వేల కోట్లు రావాల్సి ఉండేదని చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఈ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ పాలనపై పదేపదే అసత్య ప్రచారం చేస్తున్నదని మండిపడుతున్నారు. అసెంబ్లీ సాక్షిగా కాగ్ నివేదిక అసలు లెకలను బయటపెట్టిన నేపథ్యంలో.. ఇప్పటికైనా ప్రభుత్వం తప్పుడు ప్రచారం మానుకోవాలని సూచిస్తున్నారు. తప్పులను ఒప్పుకొని ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలని కోరుతున్నారు.
2024 మార్చి 31 నాటికి తెలంగాణ మొత్తం అప్పు రూ. 5,17,659 కోట్లు
బడ్జెట్ రుణాలు రూ.3,96,715 కోట్లు
బడ్జెటేతర రుణాలు రూ.1,20,944 కోట్లు
తెలంగాణకు ఉమ్మడి రాష్ట్రం నుంచి వారసత్వంగా వచ్చిన అప్పు రూ. 72 వేల కోట్లు
2023 డిసెంబర్ – 2024 మార్చి మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ. 26 వేల కోట్లు
అంటే కేసీఆర్ పాలన కాలంలో చేసిన అప్పు రూ. 4,19,659 కోట్లు
ప్రభుత్వం ప్రతినెల ఒకటో తేదీన అసలు రూ. 6500 కోట్లు వడ్డీ రూ. 6500 కోట్లు చెల్లిస్తున్నది.
అంటే.. వాస్తవ అప్పును రెట్టింపు చేసి దుష్ప్రచారం