Pharma City | రంగారెడ్డి, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): ఫార్మాసిటీ ఏర్పాటు కోసం సేకరించిన భూముల్లో ఇకనుంచి ఎలాంటి పంటలను సాగుచేయొద్దని అధికారులు ఆయా గ్రామా ల రైతులకు స్పష్టం చేశారు. ఫార్మాసిటీ కోసం యాచారం మండలంలోని మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో సేకరించిన భూములను టీజీఐఐసీ, రెవెన్యూ, పోలీసు అధికారులు బుధవారం పరిశీలించారు. ఆ భూముల్లో కొందరు రైతులు పంటలను సాగుచేసుకుంటున్నట్టు ఈ పరిశీలనలో తేలడంతో ఇకనుంచి ఎలాంటి పంటలు వేయొద్దని అధికారులు ఆదేశించారు.
ఫార్మాసిటీ ఏర్పాటు కోసం గత ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు, యాచారం, కడ్తాల్ మండలాల్లో దాదాపు 14 వేల ఎకరాల భూమిని సేకరించడంతోపాటు ఆయా భూముల రైతులకు పరిహారాన్ని కూడా అందజేసింది. అనంతరం రాష్ట్రంలో ప్రభుత్వం మారటం, ఆ భూముల చుట్టూ కంచె వేయకపోవడంతో అక్కడి రైతులు మళ్లీ పంటలు సాగు చేస్తున్నారు. దీంతో గురువారం నుంచి ఫార్మాసిటీ భూములను మళ్లీ సర్వేచేసి, ఫెన్సింగ్ వేయాలని అధికారులు నిర్ణయించారు.
ఫార్మాసిటీ ఏర్పాటు కోసం సేకరించిన భూముల్లో కొన్నింటిపై వివాదాలున్నాయి. తమ భూములను తీసుకోవద్దంటూ ఇప్పటికే దాదాపు 2 వేల ఎకరాలకు సంబంధించిన రైతులు కోర్టును ఆశ్రయించారు. దీంతో బలవంతంగా భూసేకరణ జరుపరాదని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆ 2 వేల ఎకరాల జోలికి వెళ్లరాదని అధికారులు, పోలీసులు నిర్ణయించుకున్నారు.