ఊటూర్, మే 28 : ‘నారాయణపేట – కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో భూములు కోల్పోతున్నవారంతా చిన్న, సన్నకారు రైతులం. మా తాత ముత్తాతలు, తండ్రుల కాలం నుంచి వ్యవసాయాన్ని నమ్ముకుని బతుకుతున్నాం. బంగారు పంటలు పండే మా భూములను కోల్పోతే మాకు భవిష్యత్తు ఉండదు. మేము కోరిన భూ పరిహారం ఇవ్వండి.. లేదంటే మా శవాలపై లిఫ్టు పనులు ప్రారంభించండి’ అని ఊటూర్ మండల కేంద్రం (దంతన్‌పల్లి) శివారు రైతులు జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్‌కు తేల్చిచెప్పారు. బుధవారం నారాయణపేట జిల్లా ఊటూర్ గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న ఆర్అండ్ఆర్ రైతులతో రెవెన్యూ అధికారులు గ్రామసభ ఏర్పాటు చేశారు.
దంతన్‌పల్లి శివారులో ఓపెన్ కెనాల్ నిర్మాణం కింద భూములు కోల్పోతున్న రైతుల వివరాలను సభలో వినిపించారు. పూర్తిగా వ్యవసాయ భూములు కోల్పోయిన రైతులను గుర్తించి వారికి ప్రభుత్వం ద్వారా అందే పరిహారంతో పాటు పునరావాసం-పునరాశ్రయం ద్వారా అదనపు లాభాలు వర్తింప చేస్తామని, ప్రాజెక్టు నిర్మాణ పనులకు సహకరించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ కోరారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణంలో భూము లు కోల్పోతున్న వారిలో చాలా మంది చిన్న, సన్నకారు రైతులమే ఉన్నామని, ఉన్న భూమి కోల్పోయి తమకు ఎకరా, అర ఎకరా భూమి మాత్రమే మిగిలితే వ్యవసాయం ఏ విధంగా చేసుకోవాలో చెప్పాలని నిలదీశారు. దంతన్‌పల్లి శివారులో ఎకరా భూమి రూ. కోటి వరకు ధర పలుకుతుందని, కనీసం తమకు ఎకరాకు రూ. 60 లక్షలతో పాటు ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి న్యాయం జరిపిస్తామని తహసీల్దార్ చింత రవి హామీ ఇచ్చారు.