కల్వకుర్తి, ఫిబ్రవరి 4 : చడీచప్పుడు లేకుండా పోలీసుల బందోబస్తు మధ్య చారకొండలోకి వచ్చిన బుల్డోజర్లు పేదల ఇండ్లపై పడ్డాయి. నివాసం ఉంటున్న వారు తేరుకొని ఏం జరుగుతుందని బయటకు వచ్చి చూస్తే.. బుల్డోజర్లు, జేసీబీలు ఇండ్లను నేలమట్టం చేస్తున్నాయి. కూల్చివేతలకు అడ్డం వస్తున్న బాధితులు మహిళలు, చిన్నారులను పోలీసులు నిర్దాక్షిణ్యంగా అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ నిర్బంధపు ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండల కేంద్రంలో చోటుచేసుకుంది.
చారకొండ మండల కేంద్రంలో జాతీ య రహదారికి బైపాస్ రోడ్డు నిర్మించేందుకు ఎన్‌హెచ్ అధికారులు ప్రతిపాదన లు తయారుచేశారు. బైపాస్ నిర్మాణాన్ని చారకొండ గ్రామస్తులు ఆదినుంచీ వ్యతిరేకిస్తున్నారు. చారకొండ రోడ్డునే వెడ ల్పు చేసి జాతీయ రహదారి నిర్మించాలని అధికారులకు వినతిపత్రాలు ఇచ్చారు. చివరకు ధర్నాలు, రాస్తారోకోలు చేయడంతో పనులు పెండింగ్‌లో పడ్డాయి.
బైపాస్ రోడ్డు నిర్మాణం చారకొండ-మర్రిపల్లి గ్రామాల మధ్య 2 కిలోమీటర్ల మేర ఉంటుంది. బైపాస్ నిర్మాణం చేపడితే 29 ఇండ్లు, పాఠశాల ప్రహరీ, వందల సంఖ్యలో ఇండ్ల స్థలాలు రోడ్డులో పోతాయి. బైపాస్ రోడ్డు నిర్మాణం చేపడితే తాము రోడ్డున పడుతామని బాధితులు అధికారులకు మొరపెట్టుకుంటూనే ఉన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ప్రత్యామ్నాయం చూపిన తర్వాతనే దీనిపై నిర్ణయం తీసుకోవాలనుకుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పరిస్థితి మారిపోయింది. మంగళవారం ఉదయం తమ ఇండ్లకు జేసీబీలు.. బుల్డోజర్లు వచ్చే వరకు పరిస్థితి అర్థంకాలేదు. వందల సంఖ్యలో పోలీసులు వచ్చి ఇళ్లు కూల్చేస్తున్నారు.. ఇంటి నుంచి బయటకు వచ్చేయండి.. అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆందోళనకు గురైన బాధితులు ఇక్కసారిగా బయటకు వచ్చి కూల్చివేతలను అడ్డుకునే యత్నంచేయగా పోలీసులు ఈడ్చి పక్కకు పడేశారు. ఒక పక్క కూల్చివేతలు, మరో పక్క బాధితుల రోదనల మధ్య ఆ ప్రాంతమంతా భయానకం గా మారింది. గిరిజ అనే మహిళ రోదిస్తూ ఇల్లు లేకుంటే తమకు చావే గతి అంటూ ఇద్దరి పిల్లలతో ఇంట్లోకి వెళ్లి గడియ పెట్టుకుంది. ఇళ్లతోపాటే తమనూ సమాధి చే యాలంటూ రోదించింది. అయినా కనికరించని ఖాకీలు ఇంటి తలుపులు పగులగొట్టి గిరిజన, పిల్లలను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఐదారు బాధిత కుటుంబాలు సామాన్లు సర్దుకొని భద్రపరుచుకుంటే.. మిగతా బాధితుల సామగ్రిని పోలీసులే సర్ది వ్యవసాయశాఖ గోదాం, రైతు వేదికకు తరలించారు. ఇండ్లు కూల్చిన 29 మంది బాధితుల్లో ఐదారు కుటుంబాలు మాత్రమే ప్రత్యామ్నాయం చూసుకున్నారు. మిగతా వారందరూ రోడ్డుపైనే ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. కనీసం ఒక రోజు ముందు సమాచారం ఇవ్వకుండా ఇండ్లు కూల్చడమేమిటని ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు.