దుండిగల్, నవంబర్ 1: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్‌లోని డి.పోచంపల్లిలో సుమారు 25 నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. గండిమైసమ్మ-దుండిగల్ మండలం తహసీల్దార్ రాజేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు వాటిని జేసీబీలతో నేలమట్టం చేశారు. ఏండ్లుగా నివాసముంటున్న తమ ఇండ్లను కూల్చివేశారంటూ బాధితులు రెవెన్యూ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. దుండిగల్ పోలీసులు రంగంలోకి దిగి, ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.
డి.పోచంపల్లిలోని సర్వే నంబర్ 120/28లోని ప్రభుత్వ భూమిని కొందరు కబ్జాదారులు ఆక్రమించి, రెండేండ్లుగా గదులు నిర్మిస్తున్నారని అధికారులు తెలిపారు. ప్రభుత్వ భూమిలో పదుల సంఖ్యలో అక్రమంగా నిర్మించిన గదులను మాత్రమే తొలగించామని స్పష్టంచేశారు. గతంలో అక్కడ పని చేసిన తహసీల్దార్ అలసత్వంతోనే ఆక్రమణలు జరిగాయని స్థానికంగా పలువురు చెప్తున్నారు. తహసీల్దార్‌కు సెలవు వచ్చిందంటే.. అక్కడ కబ్జాదారులు రెచ్చిపోయి నిర్మాణాలు చేపట్టేవారని గుర్తుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫిర్యాదులు అందడంతో 25 గదులను జేసీబీలతో కూల్చినట్టు తహసీల్దార్ రాజేశ్వర్‌రెడ్డి వెల్లడించారు.