హైదరాబాద్, జులై 22(నమస్తే తెలంగాణ): రాష్ట్ర మార్కెటింగ్ శాఖ ఆదాయం రోజురోజు కూ పడిపోతున్నది. తెలంగాణ తొలి ముఖ్యమం త్రి కేసీఆర్ హయాంలో భారీ ఆదాయం సమకూరగా.. కాంగ్రెస్ హయాంలో ఏటేటా తగ్గు తూ వస్తున్నది. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన 2023-24లో రూ.1225.03 కోట్ల ఫీజు వ సూలు కాగా, 2025-26లో 867.13 కోట్లుగా తగ్గుదల నమోదైంది. ఆ శాఖ ఇచ్చిన తాజా లెక్కల ప్రకారమే ఈ రెండేండ్లలో ఏకంగా రూ.358 కోట్ల మేరకు ఆదాయం తగ్గడం గమనార్హం. ఓవైపు పత్తి కొనుగోళ్లు జరిగాయి. ఇతర పంట ఉత్పత్తుల క్రయవిక్రయాలు సైతం భారీగానే జరిగాయి. అయినా మార్కెటింగ్ ఫీజు ఇంత భారీ మొత్తంలో ఆ శాఖకు తగ్గడానికి కారణాలు ఏమిటనేది అంతుపట్టడంలేదు.
ఏటేటా తగ్గుతూ వచ్చిన ఆదాయం
రాష్ట్ర మార్కెటింగ శాఖకు మార్కెట్ ఆదా యం ఏటా తగ్గుతూనే ఉన్నది. అది కూడా భా రీగా తగ్గుదల నమోదు కావడంపై అనుమానా లు వ్యక్తమవుతున్నాయి. మార్కెట్ ఫీజు వసూళ్లలో అవకతవకలపై ఈ నెల 17న నమస్తే తెలంగాణ ‘మార్కెట్ ఫీజు.. మాయాజాలం’ శీర్షికన సంచలన కథనాన్ని ప్రచురించింది. దీనిపై స్పం దించిన మార్కెటింగ్ శాఖ వివరణ ఇచ్చింది. ఆ వివరణలో ఫీజు వసూళ్లలోని డొల్లతనాన్ని బయటపెట్టుకోవడం గమనార్హం. వివరణలో మార్కెటింగ్ శాఖ పేర్కొన్న వివరాల ప్రకారం.. మార్కె ట్ ఫీజు, అద్దెలు, లైసెన్స్ ఫీ జు, జరిమానాలు, తక్పట్టి విక్రయాలు, పర్మిట్ పుస్తకాలు, ఉద్యోగు ల రుణ వసూళ్లు మొదలైన వాటికి ఈ-రిసీట్స్ జారీ చేస్తున్నట్టు పేర్కొన్నది. ఈ-రిసీట్స్ ద్వారా మూడేండ్లలో వచ్చిన ఆ దాయ వివరాలను వెల్లడించింది. ఇందులో భాగంగానే 2023-24లో 1,225. 03 కోట్ల ఫీజు వసూలైనట్టు ఆ శాఖ పేర్కొన్నది. 2024-25లో 1,063.09 కోట్లు, 2025-26 లో 867.13 కోట్లు వసూలైనట్టు వెల్లడించింది. ఈ ఏడాది 2026-27లో జులై 15వ తేదీ వర కు రూ.295.18 కోట్లు వసూలైనట్టు పేర్కొంది. ఈ లెక్కల ప్రకారం ఏటా మార్కెట్ ఫీజు వసూ ళ్లు తగ్గుతున్నట్టు స్పష్టమైంది. 2023-24తో పోల్చితే 2024-25లో రూ.162 కోట్లు తగ్గగా, 2024-25తో పోల్చితే 2025-26లో రూ.196 కోట్లు తగ్గింది. 2023-24తో పోల్చితే 2025-26లో ఏకంగా రూ.358 కోట్ల ఆదాయం తగ్గడం గమనార్హం.
రసీదుల సంఖ్యకూ ఆదాయానికీ భారీ వ్యత్యాసం
మార్కెట్లలో కొనుగోళ్లు పెద్ద ఎత్తున పెరిగినా శాఖకు రావాల్సిన ఆదాయంలో మాత్రం తగ్గుదల నమోదవుతున్నది. 2023-24లో 4.43 లక్షల రసీదులు జారీచేయగా, 2024-25లో 4.41 లక్షలు, 2025-26లో 4.15 లక్షల చొప్పున రసీదులను జారీ చేసినట్టు మార్కెటింగ్ శాఖే వెల్లడించింది. 2023-24తో పోల్చితే 2024-25లో రసీదుల సంఖ్య కేవలం 2వేలు మాత్రమే తగ్గా యి. 2023-24తో పోల్చితే 2025-26లో 28వేలు మాత్రమే తగ్గాయి. అంటే 28 వేల రసీదులు తగ్గగా ఆదాయం మాత్రం ఏకంగా రూ.358 కోట్లు తగ్గింది. 2023-24లో రూ. 87.40 కోట్లు, 2024-25లో రూ.156.69 కోట్లు, 2025-26లో రూ.126.28 కోట్ల ఆదాయం సమకూరినట్టుగా తెలిసింది.
ఫీజు ట్రెజరీలో జమయిందా? లేదా?
మార్కెట్ ఫీజు కింద వసూలు చేసిన నగదు ప్రభుత్వ ట్రెజరీలో జమయ్యిందా? లేదా? అనే అనుమానాలు, ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మార్కెటింగ్ శాఖ లెక్కల ప్రకారం 2023-24లో రూ.1,225 కోట్లు వసూలైంది. ఈ మొ త్తం ప్రభుత్వ ట్రెజరీకి జమయ్యిందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆదాయ లెక్కలను చూపిస్తున్న అధికారులు.. ఆ మొత్తాన్ని ట్రెజరీలో జమ చేయడంలేదని విశ్వసనీయంగా తెలిసింది. ఆసిఫాబాద్ ఘటనను ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. అక్కడ 2019-20, 2021-22లో వసూలు చేసిన మొత్తం రూ.11.50 లక్షల మార్కెట్ ఫీజును ట్రెజరీకి జమ చేయలేదని గుర్తించినట్టు మార్కెటింగ్‌శాఖ వెల్లడించింది.
సమగ్ర విచారణకు డిమాండ్
మార్కెటింగ్ శాఖలో ఫీజు వసూలుపై విజిలెన్స్ లేదా ఏసీబీతో విచారణ జరిపించాలని మార్కెటింగ్‌శాఖ ఉద్యోగుల నుంచే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. అవకతవలపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని వారు కోరుతున్నారు. 2018 నుంచే సాఫ్ట్‌వేర్‌ను వినియోగంలోకి తీసుకొచి ఈ-రిసీట్స్ జారీ చేస్తున్నట్టు వెల్లడించిన మార్కెటింగ్ శాఖ.. నమస్తే తెలంగాణకు ఇచ్చిన వివరణలో 2023-24 నుంచి జారీ చేసిన ఈ-రిసీట్స్, ఆదాయాన్ని మాత్రమే పేర్కొన్నది. 2019-20, 2020-21, 2021-22, 2022-23 సంవత్సరాల్లో వచ్చిన ఆదాయ వివరాలను ఎందుకు వెల్లడించలేదనేది మరో పెద్ద ప్రశ్న. ఇందులో ఆంతర్యం ఏంది? వివరాలన్నీ సాఫ్ట్‌వేర్‌లో లేక పోవడమే కారణమా? లేక అన్నీ దొంగ లెకలేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.