Congress | హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ కుమ్మక్కు రాజకీయాలు జరిపాయన్న బలం చేకూర్చేలా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీడీపీ వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. గురువారం ఖమ్మంలో టీడీపీ నిర్వహించిన ఒక కార్యక్రమానికి హాజరైన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు సహకరించినందుకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్‌తోపాటు టీడీపీ నేతలకు కాంగ్రెస్ పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు. గత ఎన్నికల్లో తెలంగాణలో రాజకీయంగా టీడీపీకి వచ్చే ప్రయోజనాన్ని కూడా పక్కనబెట్టి.. 119 నియోకవర్గాల్లో కాంగ్రెస్‌కు పూర్తి మద్దతు ప్రకటించారని పేర్కొన్నారు. టీడీపీ చేసిన సాయాన్ని కాంగ్రెస్ ఎప్పుడూ మర్చిపోదని మంత్రి స్పష్టంచేశారు.
టీడీపీ, కాంగ్రెస్ వేర్వేరు కాదని, రెండూ ఒకటేనని స్పష్టం చేశారు. అధికారంలో లేమని తెలుగుదేశం పార్టీ శ్రేణులు డీలా పడొద్దని, భవిష్యత్‌లో అందరం కలిసి ప్రయాణం చేద్దామని అన్నారు. కాంగ్రెస్ ముఖ్యనేతలంతా టీడీపీ ఏజెంట్లేనని తాము చేసిన ఆరోపణలు నిజమని చెప్పడానికి పొంగులేటి వ్యాఖ్యలే నిదర్శనమని బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు. లోపాయికారి ఒప్పందంలో భాగంగానే టీడీపీ అసెంబ్లీ ఎన్నికల పోటీ నుంచి తప్పుకొన్నదని, కాంగ్రెస్‌తో చేతులు కలిపిందని వివరిస్తున్నారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సైతం ఇప్పుడు ఇదే విషయాన్ని చెప్పారని అంటున్నారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ద్వారా బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తూనే తెలంగాణలో కాంగ్రెస్‌తో లోపాయికారీ ఒప్పందం చేసుకొని మద్దతు పలికారని మండిపడుతున్నారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నేతలు ఎవరెవరు, ఎవరెవరితో చేతులు కలిపారో, చీకటి ఒప్పందాలు చేసుకున్నారో బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మూడు పార్టీల మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు ఆదమరిచి నిద్రపోయారేమో గానీ తెలుగు తమ్ముళ్లు నిద్ర పోకుండా పనిచేశారని పొంగులేటి వ్యాఖ్యానించారు. ఆయన ఇలా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల శ్రమను తక్కువ చేసి మాట్లాడటం.. కాంగ్రెస్ శ్రేణులను అవమానించడమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెలంగాణ, ఏపీకి చెందిన టీడీపీ నేతలు వరుసగా సచివాలయానికి, సీఎం రేవంత్‌రెడ్డి నివాసానికి క్యూకట్టడం, వారికి రాచమర్యాదలు జరుగడాన్ని బట్టి అప్పుడే ప్రజలకు అనుమానం కలిగిందని చెప్తున్నారు. ఇప్పుడు పొంగులేటి వ్యాఖ్యలతో పూర్తిగా తేటతెల్లమైందని అంటున్నారు.