Telangana Economy | హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆదాయానికి గుండెకాయ లాంటి స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ నేడు వెలవెలబోతున్నది. ఒకప్పుడు అభివృద్ధికి చిరునామాగా నిలిచిన తెలంగాణ,.. నేడు ఆర్థిక సంక్షోభంలోకి జారుకుంటున్నది. ప్రభుత్వ అసమర్థ నిర్ణయాలు, విధ్వంసకర విధానాలే ఇందుకు కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అంకెలే సాక్ష్యంగా.. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ప్రగతి రథం వెనకి వెళ్తున్నదని బడ్జెట్ గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. తెలంగాణ ఏర్పడిన కొత్తలో (2014-15) కేవలం రూ. 2,177 కోట్లుగా ఉన్న స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం కేసీఆర్ హయాంలో 2023-24 నాటికి రూ.14,296 కోట్లకు పరుగులు తీసింది. కేసీఆర్ కేవలం పదేండ్లలో ఆదాయాన్ని ఏడు రెట్లు పెంచి, సంపద సృష్టించడం ఎలాగో ప్రపంచానికి చాటిచెప్పారు. స్థిరాస్తి రంగం కేసీఆర్ పాలనలో మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లింది. తెలంగాణవ్యాప్తంగా మారుమూల పల్లెలో సైతం ఎకరం భూమి రూ.50 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు పలికింది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే సీన్ రివర్స్ అయింది. భూముల ధరలు పడిపోయాయి. భూములు అమ్ముదామన్నా.. కొనే దిక్కు లేకుండా పోయింది. ఫలితంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం రికార్డుస్థాయిలో పతనమైంది.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2024-25లో రిజిస్ట్రేషన్ల ఆదాయం రికార్డుస్థాయిలో పాతాళానికి పడిపోయింది. ఏకంగా మైనస్ 42 శాతానికి పడిపోయి.. ఆదాయం రూ.8,473 కోట్లు మాత్రమే వచ్చింది. 2025-26లో రూ.19,087.26 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. ఈ సంవత్సరం జనవరి కాగ్ రిపోర్టు ప్రకారం అతి కష్టం మీద రూ.12 వేల కోట్లకు చేరుకున్నది. 2023-24లో సాధించిన రూ.14,296 కోట్ల ఆదాయాన్ని ఇప్పుడు 2025-26లో కూడా చేరుకోవడం కష్టంగానే ఉన్నది. కానీ, 2026-27 బడ్జెట్ ప్రసంగంలో మాత్రం 2025-26 సవరించిన అంచనాలు రూ.16,087.26 కోట్లుగా వెల్లడించారు. గత బడ్జెట్ అంచనాల దరిదాపుల్లోకి వెళ్లకపోయినా 2026-27 బడ్జెట్ అంచనాల్లో మాత్రం రూ.19,540.54 కోట్లుగా పేర్కొన్నారు. గతి తప్పిన ఆర్థిక వ్యవస్థ, పడిపోయిన ఆర్థికాభివృద్ధి, విధ్వంసకర విధానాలు, అసమర్థ పాలనకు ఈ గణాంకాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. సంపద సృష్టించడం కేసీఆర్ పేటెంట్ అయితే.. ఉన్న సంపదను ఆవిరి చేయడం, రాష్ట్ర ప్రతిష్టను నాశనం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ టాలెంట్ అని రిజిస్ట్రేషన్ లెకలే నిరూపిస్తున్నాయి.
రియల్ఎస్టేట్ మాత్రమే కాదు, వెహికిల్ ట్యాక్స్ (ఆర్టీఏ) ఆదాయం కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతున్నది. కరోనా లాంటి విపతర పరిస్థితుల్లో తప్ప, బీఆర్ఎస్ హయాంలో ఎప్పుడూ వాహనాల అమ్మకాలు తగ్గలేదు. 2023-24లో రూ.7,095 కోట్లుగా ఉన్న ఆర్టీఏ ఆదాయం, కాంగ్రెస్ పాలనలో రూ.6,992 కోట్లకు పడిపోయింది. మారెట్లో మనీ సర్క్యులేషన్ ఆగిపోయింది. ప్రజల కొనుగోలు శక్తి నశించింది. ఆర్థిక చక్రం మందగించి, సామాన్యుడు కొత్త వాహనం కొనడానికి కూడా భయపడుతున్నాడనే విషయాన్ని బడ్జెట్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
రాష్ట్ర స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయ వివరాలు ఇలా