హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): తన నియోజకవర్గ పరిధిలోని చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి కోరారు. చేర్యాల రెవెన్యూ డివిజన్ లేకపోవడంతో ఇక్కడి ప్రజలు సిద్దిపేట, గజ్వేల్, జనగామకు వెళ్లాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయాలని కోరారు. ఆయనకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మద్దతు పలికారు. చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయాలని, ఇది ఎప్పుటి నుంచో ఉన్న సమస్య అని తెలిపారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పందిసూ చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేసే ప్రతిపాదన కలెక్టర్ పరిశీలనలోఉన్నదని, దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.