హైదరాబాద్, జూన్ 2(నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ గ్రామంలో మంగళవారం నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్టు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈనెల 20 వరకు ఈ సదస్సులు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ సదస్సులో భాగంగా అన్ని రెవెన్యూ గ్రామాలకు తహశీల్దార్‌తో కూడిన అధికారుల బృందం వెళుతుందని, భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి.. అక్కడే సమస్యలు పరిష్కరిస్తారని తెలిపారు. ఈ మేరకు సోమవారం సదస్సుల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానవీయ కోణంలో భూ సమస్యలను పరిషరించాలని అధికారులకు సూచించారు. ఇప్పటివరకు రెండు విడతల్లో నిర్వహించిన సదస్సుల్లో 58వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని, ఇందులో 60% సమస్యలను పరిష్కరించినట్టు వెల్లడించారు. ఇందులో అధికంగా సాదా బైనామాలకు సంబంధించిన దరఖాస్తులు వచ్చాయని, ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నదని, దీనికి త్వరలో పరిషారం చూపుతామని ఆయన తెలిపారు.