Congress | హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్‌లో ‘ముఖ్యమంత్రి’ పదవి రచ్చ మొదలైంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ పెట్టిన మంటతో పార్టీలోని సీనియర్లంతా కుతకుతలాడుతున్నారు. శనివారం తాండూరులో జరిగిన ప్రచార సభలో రేవంత్‌ను సీఎం అభ్యర్థిగా సంబోధించటంపై సీనియర్లు మండిపడుతున్నారు. కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ తన ప్రసంగంలో రేవంత్‌రెడ్డి పేరు ఎత్తకున్నా.. ఆయన మాటల తెలుగు అనువాదంలో మాత్రం ‘రేవంత్‌రెడ్డి సీఎంగా ప్రమాణం చేయబోతున్నారు’ అని చెప్పిన సంగతి తెలిసిందే. ఇది రేవంత్‌రెడ్డి కావాలనే చెప్పించుకున్నాడని సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే తరహాలో సోషల్ మీడియాలో, తన ఎన్నికల ప్రచార సభల్లో, సమావేశాల్లో ‘సీఎం.. సీఎం’ అని చెప్పించుకుంటూ మైండ్ గేమ్ ఆడుతున్నారని మండిపడుతున్నారు. ఈ ప్రచారంపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదివారం గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘కాంగ్రెస్‌లో ప్రతి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అభ్యర్థే’ అని స్పష్టం చేశారు. సీఎం రేసులో తాను కూడా ఉన్నానని చెప్పకనే చెప్పారు. సీనియర్ నేత జానారెడ్డి కూడా ఇటీవల ‘సీఎం కుర్చీయే నన్ను వరిస్తుంది’ అని ప్రకటించిన విషయం తెలిసిందే. మరికొంత మంది సీనియర్లు ఒకటి రెండు రోజుల్లో బయటికి వచ్చి తామే సీఎం అని చెప్తారని విశ్లేషకులు అంటున్నారు.
రేవంత్ గుప్పిట్లోకి కాంగ్రెస్
తాము దశాబ్దాలుగా జెండా మోసి, త్యాగాలు చేసి బతికించుకుంటున్న కాంగ్రెస్.. ఇప్పుడు పూర్తిగా రేవంత్‌రెడ్డి గుప్పిట్లోకి వెళ్లిపోయిందని నేతలు, శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఐదేండ్ల కిందట వచ్చిన తన మైండ్‌గేమ్‌తో పార్టీని ఆక్రమించారని మండిపడుతున్నారు. ‘సాధారణ నేతగా కాంగ్రెస్‌లో చేరాడు. కొడంగల్‌లో పోటీ చేసి ఓడిపోయాడు. తర్వాత మల్కాజిగిరి ఎంపీ స్థానానికి టికెట్ తెచ్చుకున్నాడు. గెలిచిన తర్వాత తన పథకాన్ని అమలు చేయడం మొదలు పెట్టాడు. ఢిల్లీ పెద్దలతో మైండ్‌గేమ్ ఆడుతున్నాడు’ అని ఓ సీనియర్ నేత ఆగ్రహం వ్యక్తంచేశారు. సీనియర్లపై దుష్ప్రచారం మొదలుపెట్టి, పార్టీ దుస్థితికి వారే కారణమంటూ ప్రజల, అధిష్ఠానం ముందు దోషులుగా నిలబెట్టాడని వాపోతున్నారు.
సీనియర్ల నోటికి తాళం..
రేవంత్ బాధ్యతలు చేపట్టిన తర్వాత సీనియర్లకు వ్యతిరేకంగా పార్టీలో క్యాంపెయినింగ్ చేయించాడని ఓ సీనియర్ నాయకుడు తెలిపారు. రాహుల్‌గాంధీ రాజీనామా, సోనియాగాంధీ అనారోగ్యం తదితర కారణాలతో కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఆందోళనలో ఉండటంతో తెలంగాణ పరిణామాలపై సీనియర్లు ఎంత మొత్తుకున్నా పట్టించుకోలేదని, దీనిని రేవంత్ తనకు అనుకూలంగా మార్చుకొని నయానో, భయానో సీనియర్ల నోటికి తాళం వేశాడని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు సీనియర్లకు టికెట్లు కూడా రాకుండా చేశాడని చెప్తున్నారు. తన అనుచరులకే టికెట్లు వచ్చేలా చక్రం తిప్పాడని పలువురు సీనియర్లు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ‘కోట్లు తీసుకొని సీట్లు కేటాయించారు’ అంటూ అనేక నియోజకవర్గాల్లో అసంతృప్తి నెలకొంది.
సొంత మనుషులతో ‘సీఎం’ అభ్యర్థిగా ప్రచారం
రేవంత్‌రెడ్డి పక్కా ప్రణాళికతో ‘సీఎం’ అభ్యర్థిగా తనను తాను ప్రమోట్ చేసుకొంటున్నాడని పార్టీలోని సీనియర్లు అం టున్నారు. ఆయన ఎక్కడికి వెళ్లినా తన మనుషులకు ముందుగానే చెప్పి ‘సీఎం.. సీఎం’ అంటూ నినాదాలు హోరెత్తించేలా చేసుకొంటున్నాడని విమర్శిస్తున్నారు. ‘కర్ణాటక ఎన్నికల్లో డీకే శివకుమార్‌ను కాంగ్రెస్ అధిష్ఠానం వాడుకొని తీరా గెలిచిన తర్వాత సిద్ధరామయ్యకు సీఎం సీటు అప్పగించింది. ఇదే తరహాలో తెలంగాణలో తనను కూడా కాంగ్రెస్ వాడుకొని వదిలేస్తుందని రేవంత్‌కు అనుమానం మొదలైంది. అందుకే మళ్లీ మైండ్‌గేమ్ మొదలు పెట్టాడు. దీనికి డీకే శివకుమార్ సహకరిస్తున్నాడు’ అని ఓ నేత అన్నారు. దీనిని బట్టే డీకే కూడా రేవంత్‌రెడ్డికి సపోర్ట్ చేస్తున్నాడని స్పష్టమవుతున్నది’ అని ఓ సీనియర్ నేత విశ్లేషించారు.