హైదరాబాద్/ కరీంనగర్, మే 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బడుగు, బలహీన వర్గాలపై రేవంత్ సర్కార్ సవతి తల్లి ప్రేమ చూపుతున్నది. బడ్జెట్లో బారెడు నిధులు కేటాయిస్తున్నట్టు చూపుతున్నా ఖర్చులు మాత్రం బెత్తడు దాటడం లేదు. ఈ విషయాన్ని సాక్షాత్తూ సర్కారే ఇటీవల శానసభ సాక్షిగా ఒప్పుకొన్నది. జిల్లాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖలు రెండేండ్లుగా నిధులు లేక నీరసించిపోతున్నాయి. కొత్త పథకాలు దేవుడెరుగు పాత పథకాలకే నిధులిచ్చే దిక్కులేకుండాపోయింది. కామారెడ్డి డిక్లరేషన్, చేవెళ్ల డిక్లరేషన్ పేర్లతో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఆశలు కల్పించిన కాంగ్రెస్ సరార్.. నిధుల కేటాయింపు, ఖర్చు విషయంలో ఎలా వ్యవహరిస్తున్నదో శాసనసభ సాక్షిగా బయటపడింది.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు కార్పొరేషన్లు, ఫెడరేషన్లు తదితర 33 సంస్థలకు కలిపి రూ.14,521.98 కోట్లు కేటాయించామని స్పష్టంచేసింది. అందులో విడుదల చేసింది రూ.3,198.07 కోట్లు కాగా, ఖర్చు చేసింది రూ.305.6 కోట్లు (2.1%) మాత్రమేనని చెప్పింది. దీనినిబట్టి ఆయా వర్గాల సంక్షేమంపై రేవంత్ సరార్ చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు. ఆయా కార్పొరేషన్లకు కేటాయించిన నిధులు, చేసిన ఖర్చుల వివరాలను ఇటీవల శాసనసభకు ప్రభుత్వం నివేదించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లు, వివిధ ఫెడరేషన్లు, ఇతర కార్పొరేషన్లకు ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన నిధులెన్ని? అందులో ఎన్ని నిధులు విడుదల చేసింది? ఎన్ని నిధులు ఖర్చు చేసింది? తదితర వివరాలను తెలిపింది. కేటాయించిన మొత్తం నిధుల్లో 2.1% మాత్రమే ఖర్చు చేసినట్టు వెల్లడించింది. మొత్తం 33 సంస్థలకుగాను 22 సంస్థలకు ఒక రూపాయి కూడా విడుదల చేయలేదు.
పేరుకే కొత్త కార్పొరేషన్లు
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎస్సీలకు సంబంధించి మాల, మాదిగతోపాటు మిగిలిన 57 షెడ్యూల్డ్ కులాలకు వేర్వేరుగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఏటా రూ.750 కోట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఎస్టీలకు సంత్‌సేవాలాల్ లంబాడీ కార్పొరేషన్, ఎరుకల కార్పొరేషన్, తుకారాం ఆదివాసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏటా రూ.500 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చింది. అన్ని బీసీ కులాల సమగ్రాభివృద్ధికి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి యువతకు రూ.10 లక్షల వరకు పూచీకత్తు లేకుండా వడ్డీలేని రుణాలు అందిస్తామని వాగ్దానం చేసింది. పార్లమెంట్ ఎన్నికల ముందు హడావుడిగా పలు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ముదిరాజ్, యాదవ కుర్మ, మున్నూరుకాపు, పద్మశాలి, పెరిక (పురగరిక్షత్రియ), లింగాయత్, మేర, గంగపుత్ర, ఆదివాసీ, సంత్ సేవాలాల్ లంబాడీ, ఏకలవ్య, ఈబీసీకి (ఆర్థికంగా వెనుకబడిన తరగతులు) సంబంధించి ఆర్యవైశ్య, రెడ్డి కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఎస్సీ కార్పొరేషన్‌ను మాల, మాదిగ కార్పొరేషన్లుగా వేరు చేయాలని ఆదేశాలిచ్చి చేతులు దులుపుకొన్నది. 57 షెడ్యూల్డ్ కులాల కార్పొరేషన్ ఏర్పాటు ఊసే ఎత్తడం లేదు. ఇవేగాక బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఏర్పాటు చేసిన 8 బీసీ కులాలు రజక, నాయీబ్రాహ్మణ, వడ్డెర, సగర (ఉప్పర) వాల్మీక బోయ, కృష్ణబలిజ, భట్రాజ్, కుమ్మరి ఫెడరేషన్లను సైతం కార్పొరేషన్లుగా మార్చాలని నిర్ణయించినా ఇప్పటికీ ఉత్తర్వులు రాలేదు. మొత్తంగా 33 కార్పొరేషన్లు, సమాఖ్యలకు కలిపి కేవలం 16 సంస్థలకు మాత్రమే పాలక మండళ్లను కాంగ్రెస్ సరార్ ఏర్పాటు చేసింది. మిగతా కార్పొరేషన్లు, సమాఖ్యలకు అందుబాటులో ఉన్న ఆయా శాఖల ఏడీలు, జేడీలకే అదనపు బాధ్యతలను అంటగట్టి నెట్టుకొస్తున్నది.
పలు కీలక కార్పొరేషన్లకు కేటాయింపులు, చేసిన ఖర్చులు (రూ.కోట్లలో..)
