ఖైరతాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : మూసీ ప్రక్షాళన, హైడ్రా పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి పేదల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని వివిధ పార్టీల నేతలు, ప్రజాసంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పెద్దలు, చుట్టాలు, పక్కాలకు నోటీసులతో సరిపెట్టి, పేదల ఇండ్లు రాత్రికి రాత్రే కూల్చివేయడం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్న వక్తలు ప్రభుత్వం, సీఎం తీరును తప్పుబట్టారు. సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్‌నేత దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ సబర్మతి, గంగా, కొరియా నదుల పేర్లు చెబుతున్న రేవంత్ ముందుగా మూసీ చరిత్ర తెలుసుకోవాలని సూచించారు. ఫోర్త్ సిటీ, మూసీ ప్రక్షాళన తెరపైకి తీసుకొస్తూ ఎన్నికల హామీలు పక్కన పెట్టారని మండిపడ్డారు. మూసీ కాలుష్యాన్ని అరికట్టకుండా ప్రక్షాళన అసాధ్యమని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో 16 మురుగు నీటి శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేసినట్టు గుర్తుచేశారు. సమగ్రమైన అధ్యయనం, ప్రజల భాగస్వామ్యంతోనే మూసీని ప్రక్షాళన సాధ్యమని తెలిపారు. బుల్డోజర్ రాజ్ నహీ చలేంగే అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చెబుతుంటే తెలంగాణలో రేవంత్ బుల్డోజర్ రాజ్యమే నడిపిస్తున్నారని నిప్పులుచెరిగారు. కొరియాలో నదీ ప్రక్షాళనలో అవినీతికి పాల్పడ్డ ప్రభుత్వాధినేతకు జైలు శిక్ష పడిందని, ప్రైవేటు కంపెనీల ఎస్టిమేషన్లతో పనులు చేస్తే రేవంత్‌కు కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు.
బీఆర్ఎస్ నేత రాగిడి లక్ష్మా రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరించారని, అది మనసులో పెట్టుకుని సీఎం రేవంత్‌రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మూసీ అభివృద్ధి మాటున పేదల ఇండ్లు కూల్చివేస్తున్నారని విమర్శించారు. పేదలు కష్టపడి 40, 50 గజాలలో కట్టుకున్న ఇండ్లను కూల్చి రాత్రికి రాత్రి రోడ్డున పడేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టలేదని తప్పుడు ప్రచారం చేసిన కాంగ్రెస్ నేతలు నేడు ఆ ఇండ్లనే మూసీ బాధితులకు ఇస్తామని చెప్పడాన్ని ప్రజలు గుర్తించాలని అన్నారు.
ఆప్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ దిడ్డి సుధాకర్ మాట్లాడుతూ మూసీ నది ప్రక్షాళన, సుందరీకరణకు ఎవరూ వ్యతిరేకం కాదని, కానీ ప్రాజెక్టు చేపట్టే ముందు అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాల్సి ఉందని అన్నారు. అలాగే పర్యావరణ వేత్తలు సలహాలు, సూచనలతో డీపీఆర్ తయారు చేసి వెబ్సైట్లో పెట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో టీడీపీ, జనసేన, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ, ఫార్వర్డ్ బ్లాక్ నేతలు పాల్గొన్నారు.