హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): పీసీసీ అధ్యక్షుడు రేవంత్ బేషరతుగా పోలీసులకు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే కరుడుగట్టిన క్రిమినల్‌గా ప్రవర్తిస్తున్న రేవంత్‌పై చర్యలు తీసుకోవాలని బుధవారం ఆయన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అధికారంలోకి వస్తే పోలీసులను బట్టలు విప్పి కొడతాననే ఆయన ఆటవిక వైఖరిని తీవ్రంగా పరిగణించారు. రేవంత్ బాధ్యతారాహిత్యం సహించరానిదని పేర్కొన్నారు. రేవంత్ అసాంఘిక, నేరపూరిత ప్రవర్తన మానుకోవాలని హితవు పలికారు. రేవంత్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించి, సూమోటాగా కేసు నమోదు చేయాలని డీజీపీని ఆయన కోరారు.