వనపర్తి టౌన్, నవంబర్ 23 : రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా కల్పిస్తామని హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా బీసీలను మోసం చేస్తున్నదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి అరవింద్‌స్వామి ఆరోపించారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్‌చౌక్‌లో జిల్లా బీసీ సంఘం నేతలు జీవో ఎంఎస్-46 పంచాయతీ రాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఇచ్చిన జీవో కాపీలను ఆదివారం దహనం చేశారు. ఈ సందర్భంగా అరవింద్‌స్వామి మాట్లాడుతూ.. బీసీలకు రాష్ట్రంలో 42 శాతం రిజర్వేషన్లను చట్టబద్ధంగా కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు కామారెడ్డిలో డిక్లరేషన్ చేసి మాట తప్పిందని విమర్శించారు. పార్టీలకతీతంగా బీసీలందరూ ఏకమై బీసీ రిజర్వేషన్లు, హక్కులను కాపాడుకోవాలని , బీసీ జాతికి ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందపెట్టాలని పిలుపునిచ్చారు.