Congress Govt | హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మద్యం ధరలు భారీగా పెరగనున్నాయి. బీరుపై కనీసం రూ.20, లిక్కర్ బాటిల్‌పై రూ.30-50 వరకు పెరగనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ప్రస్తుతం బ్రూవరీలకు ప్రభుత్వం చెల్లిస్తున్న ధరలను 10 నుంచి 15% మేరకు పెంచాలని నిర్ణయించిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు 20-25 శాతం మేరకు పెంచాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ భారం పూర్తిగా వినియోగదారులపైనే పడనున్నది. తొమ్మిదన్నరేండ్ల పాలనలో కేవలం రెండుసార్లు మాత్రమే మద్యం ధరలను సవరించిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. ఓసారి పలు బ్రాండ్ల ధరలను తగ్గించింది. 2023 ధరలు పెంచాల్సి ఉన్నప్పటికీ ఎన్నికల కోడ్ వల్ల ఆ నిర్ణయం వాయిదా పడింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. సంక్షేమ పథకాల అమలుకు డబ్బులు లేకపోవడంతో మద్యం ధరల పెంపుపైనే ఆధారపడింది.
ఒక్కో కేసుకు రూ.450 డిమాండ్
తెలంగాణలోని 6 బ్రూవరీల్లో ఏటా 88 కోట్ల లీటర్ల బీరు ఉత్పత్తి అవుతున్నది. ఆ బీరును తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కొనుగోలుచేసి మద్యం దుకాణాలకు సరఫరా చేస్తున్నది. 12 లైట్ బీర్లు ఉండే ఓ కేసుకు రూ.289, స్ట్రాంగ్ బీర్ల కేసుకు రూ.313 చొప్పున చెల్లిస్తున్న బేవరేజెస్ కార్పొరేషన్.. నిర్వహణ ఖర్చులు కలుపుకొని ఒక్కో కేసును రూ.1,400 చొప్పున మద్యం దుకాణాలకు విక్రయిస్తున్నది. దీంతో మద్యం వ్యాపారులు ఇతర ఖర్చులన్నీ కలిపి ఒక్కో కేసును రూ.1,800 చొప్పున అమ్ముకుంటున్నారు. తయారీ కేంద్రాల వద్ద సుమారు రూ.24కి లభించే బీరు బాటిల్.. బేవరేజెస్ కార్పొరేషన్ నుంచి మద్యం దుకాణాలకు వచ్చేసరి రూ.117, వినియోగదారులకు వచ్చేసరికి రూ.150 ధర పలుకుతున్నది.
అయితే, రాష్ట్రంలో 2021 తర్వాత మద్యం ధరలు పెరగలేదని, ప్రస్తుతం ముడిసరుకు ధరలతోపాటు తమ నిర్వహణ ఖర్చులు భారీగా పెరిగినందున కనీసం 20-25% మేరకు ధరలు పెంచాలని అన్ని బ్రూవరీలు ఎక్సైజ్ కమిటీని డిమాండ్ చేశాయి. అనంతరం ఒక్కో బ్రూవరీ ప్రతినిధులను పిలిచి విడివిడిగా మాట్లాడగా.. పెరిగిన నిర్వహణ ఖర్చుల దృష్ట్యా ఒక్కో కేసు ధరను కనీసం రూ.450 పెంచాలని కమిటీని కోరారు. దీంతో బ్రూవరీలు అడిగినంత కాకపోయినా కనీసం 10-15 శాతం మేరకు పెంచేందుకు సిద్ధమైన బేవరేజెస్ కార్పొరేషన్.. ఆ ఖర్చును పూడ్చుకునేందుకు వినియోగదారులపై అదనంగా 20-25 శాతం మేరకు భారాన్ని మోపనున్నది.
ధరల పెంపునకు కసరత్తు పూర్తి
మద్యం ధరలు ఎంత పెంచాలన్న దానిపై ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్టు తెలిసింది. ప్రజా సంక్షేమ పథకాల అమలుకు డబ్బులు లేకపోవడంతో ఆదాయం పెంపు మార్గాలపై దృష్టిసారించాలని ప్రభుత్వం ఇప్పటికే వివిధ శాఖలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఇటీవల జరిగిన రెవెన్యూ మీటింగ్‌లో మద్యం ధరల పెంపు ప్రస్తావన తీసుకొచ్చినట్టు తెలిసింది. పెరిగిన ధరలను డిసెంబర్ రెండో వారం లేదా మూడో వారంలో అమల్లోకి తీసుకురానున్నట్టు విశ్వసనీయ సమాచారం. మొత్తానికి ఈ ధరల పెంపుతో రాష్ట్ర ఖజానాకు అదనంగా రూ.7 వేల కోట్ల వరకు ఆదాయం రానున్నది.