హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 15(నమస్తే తెలంగాణ): హైటెక్‌సిటీ అనగానే మనకు టక్కున గుర్తుకొచ్చేది వేలాది భారీ భవంతులు, ధగధగలాడే ఐటీ టవర్లు, లక్షలాది మంది ఉద్యోగులు, నిత్యం రద్దీగా ఉండే రోడ్లు.. ఇలా హైటెక్ సిటీ, దాని చుట్టుపక్కల ప్రాంతాలను ‘నిద్రపోని నగరం’గా పిలుస్తుంటారు. మరి అలాంటి ప్రాంతాన్ని ‘హైటెక్ సిటీ చుట్టుపక్కల మనిషి అనేవాడే లేడు, మనిషి అనేవాడే రాడు’ అని ఎవరైనా అంటే? నవ్వొస్తుంది కదా?. ఆ వ్యాఖ్యలు చేసింది సాక్షాత్తూ సీఎం రేవంత్‌రెడ్డి. అవును నిజమే శుక్రవారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగిన క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెట్రో విస్తరణపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. తమ ప్రభుత్వం చేసిన మెట్రోరైలు రెండో దశ రీ డిజైనింగ్‌ను సమర్థించుకునే క్రమంలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీపై వింత వ్యాఖ్యలు చేశారు.
మనిషి అన్నవాడే కనిపించడు..
నిత్యం లక్షలాది మంది ఉద్యోగులతో, దేశ,విదేశీ ప్రతినిధులతో, పౌరులతో రద్దీగా ఉండే హైటెక్ సిటీ నుంచి ఎయిర్‌పోర్ట్‌కు కనెక్ట్ చేస్తూ కేసీఆర్ ప్రభుత్వం మెట్రో రైలు రెండో దశను డిజైన్ చేసిన సంగతి తెలిసిందే. దీనిని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. నాగోల్ నుంచి ఎయిర్‌పోర్ట్‌కు కొత్త డిజైన్‌ను రూపొందించింది. దీనిని సమర్థించుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి నానా కష్టాలు పడుతున్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ‘జన సంచారమే లేని హైటెక్‌సిటీ నుంచి ఎయిర్‌పోర్టుకు వెళ్లేవారు ఎంత మంది ఉంటారు? హైటెక్‌సిటీ దాటితే చెరువులు, అటవీ భూములు ఉన్నాయి. ఇక్కడ మనిషనేవాడే లేడు, మనిషనేవాడే రాడు’ అని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో హైటెక్ సిటీ నుంచి ఫైనాన్షియల్ సిటీ నుంచి నియోపోలిస్ వరకు మెట్రోరైలును పొడిగిస్తున్నట్టు చెప్పారు. ఓవైపు జనాలు లేరని చెప్తూనే మరోవైపు పొడిగించడం ఏమిటని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
ఎంతమంది ఎక్కుతారు?
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో నివసించేవారిపైనా రేవంత్‌రెడ్డి వింత వ్యాఖ్యలు చేశారు. ‘ఈ ప్రాంతం నుంచి మెట్రోలో ప్రయాణించేవాళ్లు ఎంత మంది ఉంటారు?’ అని ప్రశ్నించారు. ఈ లెక్కన ప్రస్తుతం ఉన్న మెట్రోరైలు సదుపాయాన్ని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో ఎవరూ వాడుకోవడం లేదా? అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్‌సిటీ, మాదాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తదితర ప్రాంతాల నుంచి నిత్యం వందలాది మంది విమానాల్లో జాతీయ, అంతర్జాతీయ ప్రయాణాలు చేస్తుంటారని పేర్కొంటున్నారు. హైటెక్‌సిటీ నుంచి ఎయిర్పోర్ట్ వరకు మెట్రోను అనుసంధానిస్తే వారికి సౌకర్యవంతంగా ఉంటుందని, అందుకే కేసీఆర్ ప్రభుత్వం అక్కడ ప్రతిపాదించిందని గుర్తు చేస్తున్నారు. నాగోల్ నుంచి చాంద్రాయణగుట్ట, శంషాబాద్ మీదుగా మెట్రోను కనెక్ట్ చేస్తే ఎవరూ కాదనరని, ఇదే సమయంలో నిత్యం వేలాది మందికి ఉపయోగపడే మార్గాన్ని రద్దు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
మళ్లీ చంద్రబాబు భజన
చంద్రబాబు నాయుడును మరోసారి రేవంత్‌రెడ్డి ఆకాశానికి ఎత్తేశారు. హైటెక్‌సిటీని చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేశారంటూ పొగిడేశారు. నచ్చినా నచ్చకున్నా ఇదే నిజమన్నారు. కొంత మంది చంద్రబాబుతో విభేదిస్తారని, అయినా హైటెక్‌సిటీని కట్టింది ఎవరంటే చంద్రబాబు అని చెప్పుకోవాల్సిందేనని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, వైఎస్‌ఆర్‌లాంటి వారు హైటెక్ సిటీ, ఓఆర్ఆర్ నిర్మించకపోతే హైదరాబాద్ అభివృద్ధి జరిగేది కాదన్నట్టుగా మాట్లాడారు.
ఢిల్లీ పర్యటనలకు సమర్థన
సీఎం రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అనుమతులు ఇచ్చేది ఢిల్లీలో ఉన్నప్పుడు ఢిల్లీ పోవాల్సిందే అని వ్యాఖ్యానించారు. ఎలివేటెడ్ కారిడార్లు, మూసీ, మెట్రోకు అనుమతులు, గ్రాంట్లు, సావరీన్ బాండ్లు ఇవ్వాలంటే ఢిల్లీలోని కేంద్రమే ఇవ్వాల్సి ఉందన్నారు. అందుకే అక్కడకు వెళ్తున్నానని చెప్పారు. అందరినీ కలిసి ఢిల్లీలో ప్రయత్నం చేస్తుంటే, ఎన్ని సార్లు పోయిండనీ లెక్కలు వేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. సీఎం వ్యాఖ్యలపై రాజకీయ విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ రాష్ట్ర అభివృద్ధి కోసమే ఢిల్లీకి వెళ్తే కాంగ్రెస్ కార్యాలయం చుట్టూ ఎందుకు ప్రదక్షిణలు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకు 50కిపైగా ఢిల్లీ పర్యటనలు చేశారని, ఎన్నిసార్లు నేరుగా కేంద్ర ప్రభుత్వ పెద్దలను మాత్రమే కలిసి తిరిగి వచ్చారో వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు.