హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అభినందన సభ పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభ అట్టర్ ఫ్లాప్ అయింది. భారీ ఏర్పాట్లు, హంగు ఆర్భాటాలతో యూసుఫ్‌గూడలో ఏర్పాటు చేసిన సభకు సినీ కార్మికులు ముఖం చాటేశారు. సినీ పరిశ్రమలోని 24 క్రాఫ్ట్స్‌కు చెందిన వారిలో ఎవరూ ఆసక్తి చూపలేదు. దీంతో సభా ప్రాంగణమంతా వెలవెలబోయింది. ఎక్కడ చూసినా ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. సినిమా పరిశ్రమ పెద్దలు, హీరోలు, దర్శకులు, నిర్మాతలతో సహా అన్ని విభాగాల ప్రతినిధులు హాజరవుతారని పెద్ద ఎత్తున ప్రచారం చేసినా లాభం లేకుండా పోయింది. కొద్దిమంది సినీ కార్మికులు, ఒకరిద్దరు సినీ పెద్దలు మినహా ఎవరూ కనిపించలేదు. సీఎం సభ పేరిట మంగళవారం సినిమా షూటింగులు, పోస్టు ప్రొడక్షన్ కార్యక్రమాలను రద్దు చేసినా లాభం లేకపోయింది. జూబ్లీహిల్స్ పరిధిలో సుమారు 25,000 ఓట్లున్నప్పటికీ సీఎం సభకు 1000 మంది కూడా రాలేదు. అందులోనూ సగానికి పైగా సినీ పరిశ్రమతో సంబంధం లేని వారే ఉన్నారు. వీరందరినీ జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్లు షూటింగుల కోసం తీసుకొచ్చినట్టుగా సీఎం సభకు తరలించారు. వారంతా సిటీలోని ఇతర ప్రాంతాల నుంచే వచ్చారు. అయినా సీఎం మాట్లాడేటప్పుడు సభా ప్రాంగణంలో ఎటు చూసినా సగానికిపైగా కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. దీంతో సినీ పరిశ్రమ పెద్దలపై రేవంత్‌రెడ్డి అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో సీఎం హాజరైన తొలి సభ అట్టర్ ప్లాఫ్ కావడంతో కాంగ్రెస్ శ్రేణులు అంతర్మథనంలో పడ్డారు.
జాడలేని సినీ ప్రముఖులు.. కనిపించని కార్మిక సంఘాలు
యూసుఫ్‌గూడ సీఎం సభకు సినీ ప్రముఖులు హాజరవుతారని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. సినిమా హీరోలు, పెద్దపెద్ద దర్శకులు, నిర్మాతలు రానున్నట్టు ప్రకటించారు. కానీ రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలకు పరాభవం తప్పలేదు. హీరోలు, దర్శకులు కాదుకదా కనీసం జూనియర్ ఆర్టిస్టులు కూడా సభకు హాజరు కాలేదు. ఫిల్మ్ ఫెడరేషన్ చైర్మన్ దిల్ రాజు మినహా ఎవరూ కనిపించలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎవరినీ వదలకుండా వేధింపులకు గురిచేయడంతో సినీ పరిశ్రమ పెద్దల నుంచి కార్మికుల దాకా ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. సమయం వచ్చినప్పుడు తామేంటో చూపించాలని వేచి చూస్తున్నారు. అగ్రనటులు నాగార్జున, అల్లు అర్జున్ సహా నటి సమంతను కూడా టార్గెట్ చేసి వేధింపులకు గురిచేశారు. సినీ కార్మికులకు వేతన సవరణలో 30 శాతం పెంచాల్సింది పోయి 15 శాతానికి పరిమితం చేయడంతో ప్రభుత్వంపై సినీ పరిశ్రమలోని అన్ని వర్గాలు ఆగ్రహంతో ఉన్నాయి. పరిశ్రమలోని ప్రముఖులతో పాటు కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాగానే వారిపై వరాల జల్లు కురిపిస్తూ మభ్యపెడుతున్నారు. ఈ క్రమంలోనే సీఎం అభినందన సభకు హాజరు కాకుండా ఉన్నారని తెలుస్తున్నది.
వెలవెలబోయిన సభా ప్రాంగణం
ముఖ్యమంత్రి అభినందన సభలో జనాల కంటే ఖాళీ కుర్చీలే ఎక్కువగా దర్శనమిచ్చాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సుమారు 25 వేల మంది సినీ పరిశ్రమకు చెందిన ఓటర్లున్నారు. వారందరినీ ప్రలోభాలకు గురిచేయాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్‌రెడ్డి అభినందన సభ పేరిట బహిరంగ సభ ఏర్పాటు చేశారు. కానీ రెండేండ్లలో కాంగ్రెస్ సర్కారు వేధింపులకు బలైన పరిశ్రమ ప్రముఖులు, కార్మికులు నిశ్శబ్ద నిరసన తెలిపారు. హంగు ఆర్భాటాలతో ఏర్పాటు చేసిన సభకు కనీసం వెయ్యి మంది కూడా హాజరు కాలేదు. షూటింగులకు తీసుకొచ్చే అడ్డా కూలీలను సభకు తరలించారు. వీరందరినీ మూసాపేట, రాజేంద్ర నగర్ నుంచి వాహనాల్లో తీసుకొచ్చినట్టు సమాచారం. ఒక్కొక్కరికి రూ.500-రూ.1000 వరకు ఇచ్చి షూటింగ్‌లకు ఎక్స్ట్రాలుగా తీసుకొచ్చినట్టు తరలించారని చెప్తున్నారు. తమను పెద్ద పెద్ద సినిమాల్లో జనసమూహం కోసం దినసరి కూలీలుగా తీసుకొస్తారని, ఈ సభకు కూడా అలానే వచ్చామని వారే స్వయంగా చెప్పారు. సభకు వచ్చిన వారిలో 80 శాతం మంది బయట నుంచే వచ్చినట్టు తెలిసింది.
అభినందన సభ కార్మికులను మోసం చేసినందుకా?
అధికారంలోకి రాగానే చిత్రపురికాలనీలో అవినీతిని రూపుమాపేందుకు చర్యలు తీసుకుంటామని మ్యానిఫెస్టోలో పెట్టి మోసం చేసినందుకు సీఎం రేవంత్‌రెడ్డి సత్కారం చేయించుకున్నారా? సినీ కార్మికుల వేతనాలు 30శాతం పెంచాలని సమ్మె చేస్తే 15 శాతం పెంచి చేతులు దులుపుకొన్నందుకు సన్మానం చేయించుకున్నారా? 12 గంటల కాల్షీట్స్ను 15 గంటలకు పెంచి కార్మికులపై అదనపు భారం వేయించినందుకా? దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలి. సభను నిర్వహించిన ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌పై 20 పైగా కేసులు ఉన్నాయి. 60 రోజులు జైలుకు పోయి వచ్చారు.
సభ ఏర్పాటు చేయడానికి రెక్కాడితే గానీ డొక్కాడని వేలాదిమంది సినీ కార్మికుల పొట్టకొట్టారు. నిర్మాతలకు, 24 క్రాఫ్ట్స్‌లోని కార్మికులకు మధ్య సమస్యలు తలెత్తితే సీఎం రేవంత్ పరిష్కారం చేయకుండా కమిటీలు వేసి చేతులు దులుపుకొన్నారు. సినీ కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటామంటూ మాయమాటలు చెప్పే మోసగాళ్లను సీఎం ప్రోత్సహిస్తున్నారు. ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్, జూనియర్ ఆర్టిస్ట్స్ అధ్యక్షుడితో పాటు ఇతర నేతలు బయటి ప్రాంతాల నుంచి సీఎం అభినందన సభకు జనాన్ని తరలించారు. సభకు వచ్చిన వారిలో 80 శాతం మంది బయటి వారే. సీఎం అభినందన సభకు రాకపోతే షూటింగ్స్‌లోకి రానివ్వం అంటూ బెదిరింపులకు దిగినా సినీ కార్మికులు రాలేదంటే పరిస్థితిని ఇకనైనా అర్థం చేసుకోండి.
-కస్తూరి శ్రీనివాస్, సినీ డైరెక్టర్స్ యూనియన్ జాయింట్ సెక్రటరీ