Revanth Reddy | హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): సీఎం కుర్చీపై రేవంత్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ ఆయనకు ముఖ్యమంత్రి కుర్చీపై అపనమ్మకం పోలేదని స్పష్టమవుతున్నది. మంగళవారం హైదరాబాద్‌లో మాజీ ఎంపీ కేవీపీ రాంచందర్‌రావు నిర్వహించిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మెమోరియల్ అవార్డు కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. సేంద్రీయ వ్యవసాయంలో విశేష కృషి చేస్తున్న డాక్టర్ సుభాష్ పాలేకర్‌కు అవార్డు అందజేశారు. పాలేకర్ సూచించిన ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తాను ఇలా పక్కకు జరిగితే, అలా కుర్చీలో కూర్చొనే వాళ్లు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ‘మనం ఎవరినైనా మొదటివారం లోపలికి రానిస్తే.. రెండో వారంలో మనం కాసేపు ఇలా జరిగి అలా పక్కకు పోతే ఆ కుర్చీలో కూర్చొనేవాళ్లున్నారు. నేనే నడుపుతాలే అనే వాళ్లు ఉన్నారు. నేను అనుభవంతో ఇవన్నీ చెబుతున్నాను’ అంటూ వ్యాఖ్యానించారు. ఆ సమయంలో వేదికపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు ఉన్నారు. రేవంత్‌రెడ్డి తన సీఎం కుర్చీ గురించే ఈ వ్యాఖ్యలు చేసినట్టు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇప్పటికీ ఆయనకు కుర్చీపై అపనమ్మకం పోలేదని ఈ వ్యాఖ్యలతో స్పష్టమవుతున్నదని అభిప్రాయపడుతున్నారు.
రంగారెడ్డి జిల్లాకు గోదావరి జలాలు
ఎన్డీఎస్ఏ సూచించినా, సాగునీటి రంగ నిపుణులు పదేపదే చెప్తున్నా మేడిగడ్డ బరాజ్‌ను మరమ్మతులు చేసి వినియోగంలోకి తేవాలనే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తేలిపోయింది. రూ.వందల కోట్లలో పూర్తయ్యే మరమ్మతులను కాదని.. రూ.వేల కోట్లతో తుమ్మిడిహట్టి దగ్గర బరాజ్‌ను నిర్మించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే వేదికపై స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ‘తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టును కడతాం. రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల, కొడంగల్, పరిగి, తాండూర్ ప్రాంతాలకు గోదావరి జలాలను తరలిస్తాం’ అని ప్రకటించారు.
పాలేకర్ సూచన బాగున్నది: సీఎం రేవంత్
ఎరువుల వినియోగం వల్ల ఏటా సుమారు రూ. 4 లక్షల కోట్లు విదేశాలకు వెళ్తున్నాయని, ప్రకృతి వ్యవసాయంతో దీనికి అడ్డుకట్ట వేయొచ్చన్న పాలేకర్ సూచన బాగున్నదని సీఎం రేవంత్ పేర్కొన్నారు. అందుకే రాష్ట్రంలో ఎరువులు వినియోగాన్ని తగ్గించేలా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామని చెప్పారు. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు, మంత్రి శ్రీధర్‌బాబుకు సూచించారు. మూడు నెలల్లోనే రాష్ట్రంలో రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేశామని, నిరుడు రైతులు పండించిన 2.85 కోట్ల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలుచేసి.. రూ.500 బోనస్ ఇచ్చిందని వ్యాఖ్యానించారు. ఇవి శుద్ధ అబద్ధాలని, రుణమాఫీ కాని రైతులు వేలల్లో ఉన్నారని ప్రజలు గుర్తు చేస్తున్నారు. బోనస్ ఇచ్చింది 23 లక్షల టన్నులకు మాత్రమే అని, ఆ బకాయిలు రూ. 1160 కోట్లు ఇప్పటివరకు రైతులకు చెల్లించలేదన్నారు.