హైదరాబాద్, సెస్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : శాసనసభ వేదికగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఉగ్రవాదులు, ఉన్మాదులుగా పోల్చుతూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య చరిత్రలోనే అత్యంత దిగ్భ్రాంతికరమైనవని రాజకీయ విశ్లేషకులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో రాజకీయ విభేదాలు తారస్థాయికి చేరినా, ఏ ఒక ముఖ్యమంత్రి సభలో ప్రతిపక్ష సభ్యులను కసబ్ లాంటి ఉగ్రవాదులతో పోల్చిన దాఖలాలు లేవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. శాసనసభను వీధి పోరాటాల స్థాయికి దిగజార్చడం విచారకరమని పేర్కొంటున్నారు.
రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇది 5వ అసెంబ్లీ సమావేశాలు అని, రెండున్నరేండ్ల నుంచి అప్పులు మీద, కేసీఆర్ మీద పడి ఏడ్వటం తప్ప ఇంకేం చేశారని రాజకీయ పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. వాస్తవాలను కప్పిపుచ్చుకోవడానికే రేవంత్‌రెడ్డి ఇలాంటి తీవ్రమైన పదజాలంతో నాటకీయతను సృష్టిస్తున్నారని ప్రతిపక్ష శ్రేణులు వాదిస్తున్నాయి. ఇచ్చిన వాగ్దానాలపై ప్రభుత్వం నుంచి సమాధానం రాబట్టేందుకు ప్రజాప్రతినిధులు సభను స్తంభింపజేయడం ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమని, దాన్ని ఉగ్రవాదంతో పోల్చడం పాలకుల అసహనానికి నిదర్శనమని సీనియర్ పాత్రికేయులు స్పష్టంచేస్తున్నారు.
రాజకీయ విమర్శల కోసం కసబ్, ముష్కరుల పేర్లు అసెంబ్లీలో వాడుకోవడం సీఎం పదవికే సిగ్గుచేటు అని పరిశీలకులు అంటున్నారు. ప్రతిపక్షం గొంతు నొకేసి, అసెంబ్లీ నుంచి బయటకు గెంటేసి, వారిని ఉగ్రవాదులు, ముషరులు అంటూ తీవ్రమైన ముద్ర వేయడం సభా సంప్రదాయాలకే గొడ్డలిపెట్టు అని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పార్టీ ఫిరాయింపులకు తెరతీసి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి చూసినప్పుడు వాళ్లు ప్రజాస్వామికవాదులుగా.. అసెంబ్లీలో ప్రశ్నిస్తే ఉగ్రవాదులుగా కనిపించే ఈ ద్వంద్వ వైఖరి పాలకుల దివాళాకోరుతనానికి నిదర్శనమని విశ్లేషకులు ఎండగడుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి తన స్థాయిని గుర్తెరిగి మాట్లాడాలని సూచిస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ముషరులు, కసబ్‌లు అంటూ చేసిన వ్యాఖ్యలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజాప్రతినిధులను, ఓటర్లను అవమానించినందుకు సీఎం క్షమాపణ చెప్పాలనే డిమాండ్ వ్యక్తమవుతున్నది.
‘ఎట్టి పరిస్థితుల్లో సభ జరుగకూడదని, ఫామ్‌హౌస్‌లో కుట్ర చేసి, వాళ్ల సభ్యులను ఉన్మాదులుగా మార్చి.. కసబ్ లాంటి ఉగ్రవాదులను, ఉన్మాదంతో కూడుకున్న వారిని భావోద్వేగంతో ఉసిగొల్పి మన మీద దాడులు చేయించారు. ఈ రోజు ఫాంహౌస్‌లో జరిగిన ఘటనను, శాసనసభ ముందు బీఆర్ఎస్ సభ్యుల మాటలను చూస్తే.. పార్లమెంట్ మీద దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులకు, ముంబైలో ఏకే 47తో సామాన్యులను కాల్చి చంపిన కసబ్‌కు, సైనికుల మీద కాల్పులు జరిగిపిన ఉగ్రవాదులకు స్పీకర్‌ను అవమానించేలా మాట్లాడిన వారికి ఏమాత్రం తేడా లేదు. వాళ్ల నేత వాళ్లను(ఎమ్మెల్యేలను) ఉన్మాదులుగా మార్చి, ఉసిగొల్పారు. ఉన్మాదానికి లోనైన, ఉసిగొల్పబడిన కొందరు ముషరులు దుర్మార్గమైన వైఖరితో శాసనసభకు వచ్చారు’ అని సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో వ్యాఖ్యలు చేశారు.