Revanth Reddy | హైదరాబాద్. ఫిబ్రవరి 22(నమస్తే తెలంగాణ): సర్వే చేసి బీసీ రిజర్వేషన్లను ఏదో ఒకరకంగా పట్టాలు ఎక్కిద్దామనుకున్న తననే రాళ్లతో కొడుతున్నారని, తమ పార్టీ నేతలే మీటింగులు పెట్టి తనను విలన్‌గా చేసి మాట్లాడుతున్నారని, కులగణన చేయని వాళ్లను మంచోళ్లుగా పొగుడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించినట్టు తెలిసింది. లెకలు చెప్పకుండా తప్పించుకున్న వాళ్లను మంచోళ్లను చేసి, బీసీ లెకలు తేల్చిన తనను చెడ్డోనిగా చూస్తే ఎలా? అని ఆయన కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలను ప్రశ్నించినట్టు సమాచారం. పార్టీలో మిగిలిన విషయాల్లో విభేదించినా తనకు ఇబ్బంది లేదని, కానీ కులగణన విషయంలో మాత్రం తనకు సహకరించాలని వారిని వేడుకున్నట్టు సమాచారం. శనివారం ప్రజాభవన్‌లో కాంగ్రెస్ బీసీ నేతతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం అయ్యారు. ఈ భేటీలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్, బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు. కులగణన సర్వే బలహీనవర్గాల భావోద్వేగమని, ఎవ్వరూ చేయని పనిని తాను చేశానని, కర్ర పట్టుకొని కాపాడుకుంటారో.. లేదంటే మౌనంగా ఉండి నష్టపోతారో.. మీ ఇష్టం అంటూ బీసీ నేతలను ఉద్దేశించి సీఎం నిష్టూరమాడినట్టు చర్చ జరుగుతున్నది.
మన వాళ్ల మౌనం సరికాదు
సర్వేకు చట్టబద్ధత కల్పించే వరకే తన బాధ్యత అని, దానిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కాంగ్రెస్ బీసీ నాయకుల మీదనే ఉన్నదని, కులగణన సర్వే లెకలు బయటపెట్టొద్దని కొందరు తన మీద ఒత్తిడి తెచ్చారని, అయినా తాను పట్టించుకోలేదని సీఎం చెప్పినట్టు తెలిసింది. సెకండ్ ఫేజ్ సర్వే పూర్తయిన తర్వాత దీనికి చట్టబద్ధత కల్పిస్తామని అన్నట్టు తెలిసింది. బీసీ లెకలు తప్పని కొందరు తప్పుడు ప్రచారం చేస్తుంటే, మన వాళ్లు మౌనంగా ఉంటున్నారని, బీసీ కాంగ్రెస్ నేతలు ప్రతిపక్షాల ఉచ్చులో పడొద్దని చెప్పినట్టు తెలిసింది. సర్వేకు ప్రజామోదం కూడా ముఖ్యమని, కాంగ్రెస్ నేతలు అన్ని సామాజికవర్గాలతో సమావేశాలు పెట్టి కులగణన మీద తీర్మానాలు చేయాలని, యూనివర్సిటీల్లో విద్యార్థులు సెమినార్లు నిర్వహించాలని సూచించినట్టు తెలిసింది. బలహీనవర్గాలకు ఇదే భగవద్గీత, ఇదే ఖురాన్, ఇదే బైబిల్ అని ఇంతకంటే మించిన పాలసీ డాక్యుమెంట్ ఏదీ లేదని రేవంత్‌రెడ్డి పేర్కొన్నట్టు తెలిసింది.
తిట్టుకున్న వీహెచ్, అంజన్‌కుమార్‌యాదవ్
బీసీ నేతల సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేతలిద్దరు వాగ్వాదానికి దిగినట్టు తెలిసింది. మాజీ ఎంపీలు వీ హన్మంతరావు, అంజన్‌కుమార్ యాదవ్ ఒకరినొకరు తిట్టుకున్నట్టు సమాచారం. వీహెచ్ మాట్లాడుతూ.. తెలంగాణలో గౌడ, ముదిరాజు, మున్నూరుకాపు, పద్మశాలి నాలుగే ప్రధాన బీసీ కులాలు ఉన్నాయని అన్నట్టుగా తెలిసింది. అంజన్‌కుమార్‌యాదవ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తూ, మరో ప్రధాన కులమైన యాదవులను ఎలా మరిచిపోతారని నిలదీసినట్టు సమాచారం. వీహ్చ్ ప్రతిస్పందిస్తూ.. ‘నీకేం తక్కువైంది.. కొడుక్కు రాజ్యసభ ఇప్పించుకున్నవ్ గదా..’ అని వ్యాఖ్యానించడంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగినట్టు సమాచారం.
సీఎం పక్కన నిలబడని బీసీ నేతలు!
తాను చేసిన లెక్కలు దేశానికే ఆదర్శమని, చరిత్రలో నిలిచిపోతాయని సీఎం అన్నట్టు తెలిసింది. బీసీ కులగణన సర్వే కోసం తాను చాలా కష్ట్టపడ్డానని, కానీ తననే విలన్‌ను చేసి మాట్లాడిన తరువాత ఇది ఎలా ముడివడుతుందని సీఎం రేవంత్‌రెడ్డి బీసీ నేతలను నిలదీసినట్టు తెలిసింది. తాను చెప్పింది కరెక్టు అనుకున్నవాళ్లు వచ్చి తన పక్కన నిలబడాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరగా.. ఒక్క బీసీ నేత కూడా సీఎం పక్కన నిలబడలేదని తెలిసింది.