కరీంనగర్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): ‘కాళేశ్వరం ఒక ప్రాజెక్టు మాత్రమే కాదు.. తెలంగాణ ప్రజల జీవనాధారం.. ఈ ప్రాజెక్టుతో చెరువులు, కుంటలకు నీళ్లొచ్చాయి. భూగర్భజలాలు పెరిగి పుష్కలంగా పంటలు పండాయి. అనతికాలంలోనే వ్యవసాయం, ఇతర వృత్తుల జీవనోపాధులు పెరిగాయి.. అని పలువురు వక్తలు వివరించారు. ప్రముఖ వైద్యుడు బీఎన్ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం కరీంనగర్లో ‘కాళేశ్వరాన్ని కాపాడుకుందాం’ అనే అంశంపై చర్చా వేదిక జరిగింది.
ఈ సదస్సులో ప్రధాన వక్తగా ప్రముఖ జలవనరుల నిపుణుడు వీ ప్రకాశ్‌తోపాటు పలువురు ఇరిగేషన్ విశ్రాంత ఇంజినీర్లు పాల్గొన్నారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టు మూలనపడితే గత యాసంగిల పంటలెట్ల ఎండిపోయాయి!? భూగర్భజలాలు ఇంకి భూమి ఎట్ల సెగలు కక్కింది? రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్ట బ్యారేజీకి మరమ్మతులు చేయకపోవడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉన్నది. ప్రాజెక్టు కొట్టుకుపోవాలి. కేసీఆర్‌ను బదనాం చేయాలని ఆశించింది. ఇది పార్టీల మధ్య కొట్లాట కాదు. తెలంగాణ ప్రజల ఆస్తి. దీనిని కాపాడుకోవాలి’ అని వక్తలంతా అభిప్రాయపడ్డారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ప్రముఖ జల వనరుల నిపుణుడు వీ ప్రకాశ్ తెలిపారు. అసలు ఈ ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యంగా సీఎం రేవంత్‌రెడ్డికి అవగాహనే లేదని స్పష్టంచేశారు. ఎక్కడైనా బ్యారేజీలు ఇసుకలో నిర్మిస్తారా? అని రేవంత్‌రెడ్డి పదేపదే అన్నారని, బ్యారేజీలు ఇసుకలోనే నిర్మిస్తారనే విషయంపై ఆయనకు అవగాహన లేకపోవడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజీకి 86 పియర్స్ ఉంటే మూడు పియర్స్ మాత్రమే దెబ్బతిన్నాయని, అంతమాత్రన ప్రాజెక్టును మూలన పడేస్తారా? అని ప్రకాశ్ ప్రశ్నించారు.
బీఆర్ఎస్ను ఓడించాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్, బీజేపీ కాళేశ్వరంపై విషప్రచారం చేశాయని విమర్శించారు. డ్యాంసేఫ్టీ అథారిటీ కూడా ఆ పార్టీలకే వంతపాడిందని చెప్పారు. తెలంగాణ ఆవశ్యకతపై ఇక్కడి ప్రజలకు సోయి తెప్పించగలిగామని, అదే నీళ్లపై సోయి తెప్పించలేక పోయామని, మేధావులు ఇప్పుడు అదేపనిలో ఉండాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయిన నాయకుడని, కోటి ఎకరాల మాగాణాన్ని చూడాలనేది ఆయన స్వప్నమని, ఇందుకోసం కొన్ని వేల గంటలు నిపుణులతో ఆయన చర్చలు జరిపిన సందర్భాలను తాను ప్రత్యక్షంగా చూశానని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయతో వేలాది చెరువులు బలోపేతమైన విషయాన్ని మర్చిపోవద్దని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ముందు, తర్వాత పరిస్థితులను గమనిస్తే కేసీఆర్ ప్రభుత్వం సాగునీటికి ఎంత ప్రాధాన్యం ఇచ్చిందో అర్థమవుతుందని చెప్పారు.
సీఎం రేవంత్‌రెడ్డి పందేండ్లు సీఎంగా పనిచేసినా తుమ్మిడిహెట్టి బ్యారేజీ సాధ్యంకాదని వీ ప్రకాశ్ తేల్చిచెప్పారు. రెండు లక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో ఈ బ్యారేజీ నిర్మించే ప్రయత్నంలో ఉన్నారని, అనుమతుల కోసం కేంద్రానికి నివేదిక పంపారని వివరించారు. కాళేశ్వరం కరెంట్‌పైనా కోదండరాం కూడా పచ్చి అబద్ధాలు చెప్పారని, స్టాండ్‌బైగా ఉండే కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక్క సీజన్లో 6,946 మెగావాట్ల విద్యుత్తు ఖర్చవుతుందని, ఎకరాకు రూ.46 వేల బిల్లు వస్తుందని కోదండరాం స్వార్థబుద్ధితో అసత్యాలు, అర్ధసత్యాలు ప్రచారం చేశారని చెప్పారు. కేసీఆర్‌పై కక్షతో తెలంగాణ ప్రజలకు నష్టం చేస్తారా? కాళేశ్వరం ఏమైనా కేసీఆర్ సొంత ఆస్తా? అని ప్రశ్నించారు.
మేడిగడ్డ పియర్లు కుంగిపోవడానికి కారణాలేమిటనేది ఇప్పటివరకు ఏ దర్యాప్తు సంస్థ కూడా పూర్తిస్థాయి నివేదిక ఇవ్వకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తున్నదని, ఇది నాణ్యతాలోపమా, నిర్వహణ లోపమా? అర్థంకావడం లేదని స్పష్టంచేశారు. 2019లో 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిన తెలంగాణలో ఐదేండ్లు కోటికి పైగా మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందంటే కారణం కాళేశ్వరం ప్రాజెక్టు కాదా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టును ముంచేందుకే ప్రధాని మోదీ, వెదిరె శ్రీరాం ఇచ్చంపల్లి ప్రాజెక్టును ప్రతిపాదిస్తున్నారని, నదుల అనుసంధానం వెనుక తెలంగాణను ఎడారి చేసే కుట్ర దాగున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. తాను ఏ పార్టీలో లేనని, రాజకీయాలతో సంబంధం లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రజలు ఉద్యమించాలని, మేధావి వర్గం ఇందుకు కృషి చేయాలని ఆయన కోరారు.
నీటి పారుదలశాఖలో ఏఈగా ఉద్యోగంలో చేరి ఎస్ఈగా రిటైర్మెంట్ తీసుకున్నాను.. నా సర్వీసులో ఇలాంటి ప్రాజెక్టునే చూడలేదని ఇరిగేషన్ శాఖ రిటైర్డ్ ఎస్ఈ భీమనాథుని సత్యనారాయణ తెలిపారు. 1969లో నెహ్రూ శంకుస్థాపన చేసిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 1980లో పూర్తయ్యిందని వివరించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కేవలం మూడేళ్లలో పూర్తి చేశారని, ఎక్కడైనా నాణ్యతాలోపం ఉంటే ఉండవచ్చని, అనేక ప్రాజెక్టుల్లో ఇలాంటివి జరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయని తెలిపారు. కానీ, ఇంత మొండిగా వ్వవహరించి రూ.వేల కోట్ల ప్రాజెక్టు పనికి రాదని వాదించడం మూర్ఖత్వమే అవుతుందని చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజల గుండెకాయ అని బీఎన్ రావు ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ బీఎన్ రావు పేర్కొన్నారు. ‘కేవలం 3 పియర్లు కుంగిపోతేనే ప్రాజెక్టును మూలన పడేస్తారా? పనులు చేసేందుకు ఎల్అండ్టీ కంపెనీ ముందుకొచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు. ఇది ఏమైనా పార్టీల పంచాయితీనా? ఇది ప్రజల సొత్తు. దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ పౌరుడిపై ఉన్నదని చెప్పారు’ ఇప్పుడు వందలాది మందితో మొదలైన ఈ ఉద్యమం రేపు వేలు, లక్షలు కావాలని పిలుపునిచ్చారు. మేధావి వర్గం ప్రజల్లో చైతన్యం తేవాలని కోరారు. రాజకీయాలు, పార్టీలకు అతీతంగా కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడుకోవాలని, అప్పుడే తెలంగాణకు బతుకుదెరువు ఉంటుందని సూచించారు. ఎంతటి ఉద్యమానికైనా తెలంగాణ మేధావులు, విద్యార్థులు, న్యాయవాదులు, వైద్యులు, జర్నలిస్టులు ఒక్కటి కావాలని కోరారు.
కేసీఆర్‌పై కోపంతో ఆయనను బదనాం చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిరుపయోగం చేసేందుకు ప్రయత్నిస్తున్నదని జగిత్యాల రైతు రాజం అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు కాళేశ్వరం వేస్ట్ ప్రాజెక్టు అంటున్నరని, ఇదే నిజమైతే ఇన్ని వడ్లు ఎట్ల పండినయ్ అని ప్రశ్నించారు. ఇక్కడి పనోళ్లు చాలక వేరే పనుల కోసం రాష్ర్టాల నుంచి ఇక్కడికి వచ్చి ఉపాధి పొందారని తెలిపారు. కాళేశ్వరం వల్ల జీవనోపాధులు పెరిగాయని, ఎస్సారెస్పీ పునరుజ్జీవం పథకంతో మెట్ట ప్రాంతాలైన వేములవాడ, గంగాధర, రామడుగు, సిరిసిల్ల ప్రాంతాల్లో నీళ్లు పుష్కలంగా ఉంటున్నాయని తెలిపారు. గ్రామాల్లోని చెరువుల్లో గోదావరి నీళ్లు పారాయని చెప్పారు. రైతులంతా ఒక్కటి కావాలని, మేధావులు మేలు కొల్పలాని, లేకుంటే మునుపటి లెక్కనే తెలంగాణ ఆగమై పోతదని ఆందోళన వ్యక్తం చేశారు.