హైదరాబాద్, డిసెంబర్ 2(నమస్తే తెలంగాణ): హిందూ దేవుళ్లపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్య లు చేశారు. భక్తుల మనోభావాలు, ఆచారాలను కించపరిచేలా వ్యాఖ్యానించారు. మూడు కోట్ల మంది దేవుళ్లు ఎందుకున్నారని ప్రశ్నించారు. మనకు దేవుడిపైనే ఏకాభిప్రాయం లేదని వ్యాఖ్యానించారు. మంగళవారం గాంధీభవన్‌లో నిర్వహించిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో సీఎం పాల్గొని మాట్లాడారు. ‘ఫుట్‌బాల్ ఆటలో బాల్‌ను కాళ్లతో తన్నడం గేమ్‌రూల్ అయితే.. రాజకీయాల్లో కాళ్లలో కట్టెపెట్టడమే గేమ్‌రూల్. ఆ కట్టెను తీసి పక్కనేసి ముందుకుపోవాలి. అధ్యక్షా.. స్పష్టత ఉందికదా.?’ అంటూ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో అందరికీ స్వేచ్ఛ ఉంటుందని, ఇందులో అన్ని రకాల మనస్తత్వాలు కలిగినవారు ఉంటారని చెప్పారు. ఏఐసీసీ అధ్యక్షులు, దేశం కోసం సర్వం త్యాగం చేసిన గాంధీ కుటుంబంపై కూడా అప్పుడప్పుడు జీ -23 అని సంతకాలు పెడుతుంటారని, పార్టీలో అంత స్వేచ్ఛ ఉన్నదని వ్యాఖ్యానించారు.
‘హిందువుల్లో ఎంతమంది దేవతలున్నారు. మూడు కోట్ల మంది ఉన్నారా? మరి అన్ని ఎందుకున్నయి? పెండ్లి చేసుకోనోనికి హనుమంతుడున్నాడు. రెండు పెండ్లిండ్లు చేసుకునేటోళ్లకు ఇంకోకాయన దేవుడున్నడు. మందు తాగేటోళ్లకు ఓ దేవుడున్నడు ఎల్లమ్మ, పోచమ్మ. కల్లు పొయ్యాలె, కోడి కొయ్యాలె అనేటోళ్లకు ఓ దేవుడున్నడు. పప్పన్నం తినేటొళ్లకు కూడా దేవుడున్నాడు. అన్ని రకాల దేవుళ్లున్నారు. కాంగ్రెస్ పార్టీలో కూడా అన్ని రకాల మనుషులున్నరు. దేవుడిపైనే ఏకాభిప్రాయంలేదు. ఒకాయన వేంకటేశ్వరస్వామికి మొక్కుతానంటే, మరొకాయన ఆంజనేయస్వామికి మొక్కుతా అంటడు. ఇంకొకాయన లేదు.. లేదు నేను అయ్యప్పమాల వేస్తానంటే, మరో ఆయన శివమాల వేస్తానంటడు. దేవుళ్లమీదనే మనం ఏకాభిప్రాయం తీసుకురానప్పుడు రాజకీయ నాయకుల మీద ఏకాభిప్రాయం ఉంటదని నేను అనుకోను’ అని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. హిందువులంటే తాగుబోతులు, తిండిబోతులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి తక్షణమే తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని, క్షమాపణ చెప్పాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
బీజేపీ కోసమేనా?
హిందూ దేవుళ్లపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వెనుక రాజకీయ రహస్య ఎజెండా ఉన్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే బీజేపీ కోసం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారనే చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా జరుగుతున్నది. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి బీజేపీ పెద్దలతో టచ్‌లో ఉన్నారనే ఆరోపణలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసే బాధ్యతను భుజానికి ఎత్తుకున్నారనే విమర్శలున్నాయి. అందుకే హిందూ దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే.. అది ఎలాగూ బీజేపీకి మైలేజ్ తీసుకొస్తుందని, ఆ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు రెచ్చపోయి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తారని, తద్వారా రాష్ట్రంలో బీజేపీకి అనుకూల వాతావరణాన్ని సృష్టించే ప్లాన్‌లో భాగంగానే ఇలా చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి తగ్గట్టే రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వెంటనే స్పందించారు. జూబ్లీహిల్స్ ఎన్నికలకు, సీఎం వ్యాఖ్యలకు, మతానికీ ముడిపెట్టి, ఒక వర్గం వారిని రెచ్చగొట్టేలా మాట్లాడారని చెప్తున్నారు.