హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ) : దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకుల ఇండ్లు ముట్టడించాలని పిలుపునిచ్చిన ఎన్డీయే, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మాత్రం ఇంటికి పిలిచి అల్పాహార విందు ఇవ్వడంపై ఇండియా కూటమిలో కలకలం రేగింది. బీజేపీ కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ శనివారం ఢిల్లీలో కొంత మంది మంత్రులు, బీజేపీ ఎంపీలతోపాటు, ఎన్డీయే కూటమిలోని ఏపీ టీడీపీ నేతలకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు. దీని గురించి తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలకు కూడా సమాచారం లేదని, సీఎం రేవంత్‌రెడ్డిని మాత్రమే ఆహ్వానించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. పైగా ఈ విందుకు ముఖ్యమంత్రి ఎలాంటి ప్రొటోకాల్ లేకుండా, ఒంటరిగా వెళ్లడం తీవ్ర చర్చనీయాంశమైంది. డీలిమిటేషన్ బిల్లు వివాదం కొనసాగుతున్న సమయంలోనే ఆయన విందుకు వెళ్లడంపై దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. దీంతో ప్రజల దృష్టి మరల్చేందుకు రేవంత్ రెడ్డి హడావుడిగా మీడియా చిట్‌చాట్ ఏర్పాటు చేసి, ఏపీ సీఎం చంద్రబాబును లక్ష్యంగా చేసుకొని కొన్ని వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలిరోజు నుంచి ఎన్డీయే కూటమి పట్ల సానుకూల ధోరణి ప్రదర్శిస్తున్నారనే విమర్శలున్న సంగతి తెలిసిందే. అవకాశం దొరికినప్పుడల్లా ప్రధాని మోదీని బడేభాయ్గా సంభోదిస్తూ, ఆయనపై ప్రశంసలు కురిపించడంపై కాంగ్రెస్ నేతలే బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఇంకా చంద్రబాబు శిష్యుడిననే భ్రమలో ఉన్నారని, అందుకే రాహుల్ గాంధీ ఆలోచనలకు భిన్నంగా అడుగులు వేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేతలు విమర్శిస్తున్నారు. అందుకే రాహుల్, రేవంత్ మధ్య గ్యాప్ వచ్చిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయినా రేవంత్ రెడ్డి వైఖరి ఏమీ మారలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లును ఓడించామని ఇండియా కూటమి నేతలు సంబురాలు జరుపుకొంటుండగా ఢిల్లీలోనే ఉన్న సీఎం రేవంత్ రెడ్డి వారిని కలువకుండా ఎన్డీయే నేతలతో విందులో పాల్గొనడంపై పార్టీలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయట! బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తెలంగాణ ఏర్పాటుపై విషం చిమ్మినా రేవంత్‌రెడ్డి కనీసం ఖండించకుండా మౌనంగా ఉండి, తాజాగా అదే బీజేపీ నేతలతో చెట్టపట్టాలేసుకొని తిరుగుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి షాక్ ఇచ్చారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. బీజేపీపై పోరాటం చేస్తున్నట్టు గల్లీలో మీడియా ముందు హడావుడి చేసి, ఢిల్లీలో మాత్రం ఎన్డీయేతో అంటకాగుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
విందుకు వెళ్లిన విషయం బయటికి పొక్కడం, సంబంధిత వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం, ఇంటాబయట విమర్శలు వెల్లువెత్తడంతో రేవంత్‌రెడ్డి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. శనివారం మధ్యాహ్నం హడావుడిగా మీడియా చిట్‌చాట్ ఏర్పాటు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని లక్ష్యంగా చేసుకొని రాజకీయ వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో జతకట్టిన ప్రాంతీయ పార్టీల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని, తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రాంతీయ పార్టీలను వాడుకొని వదిలేస్తుందని సీఎం పేర్కొన్నారు. ఇందుకు నితీశ్ కుమార్, ఏక్ నాథ్ షిండే ప్రస్తుత పరిస్థితే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఇదే తరహాలో టీడీపీ అధినేత చంద్రబాబుకు సైతం భవిష్యత్తులో చేదు అనుభవాలు తప్పవని, బీజేపీ బలం పెరిగితే నితీశ్‌కు పట్టిన గతే చంద్రబాబుకు పడుతుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే చిట్‌చాట్‌లో మామూలుగా మాట్లాడితే విందు రాజకీయం నుంచి ప్రజలు, రాజకీయ పరిశీలకులు, మీడియా దృష్టిని మళ్లించలేమని, అందుకే చంద్రబాబుపై వ్యాఖ్యలు చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.