చిక్కడపల్లి, జనవరి 9 (నమస్తే తెలంగాణ): నిరుద్యోగులకు జడిసిన సీఎం రేవంత్‌రెడ్డి రూట్ మార్చారు. ఎక్కడి కక్కడ నిర్బంధాలు విధించి ప్రైవేట్ మాల్ ఓపెనింగ్ చేసి తీవ్ర విమర్శల పాలయ్యారు. సీఎం కార్యక్రమానికి నిరుద్యోగులు ఎక్కడ ఇబ్బందులు పెడతారోనని గురువారం రాత్రి నుంచే ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ ఏరియాను అదుపులోకి తీసుకున్న పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం వరకు చేసిన హంగామాపై జనం మండిపడ్డారు. అరగంట కార్యక్రమానికి ఆరేడు గంటల హడావుడి ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గురువారం రాత్రి నుంచే అశోక్‌నగర్ నుంచి నారాయణగూడ వరకు పోలీసులు మోహరించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌కు వస్తున్న నేపథ్యంలో నిరసనలు తలెత్తకుండా ఆ ప్రాంతమంతా బంధించేశారు. ఎటు చూసినా వందలాదిగా పోలీసులు రోడ్లపై కనిపించడంతో జనం తీవ్ర అసహనానికి గురయ్యారు. మొదట అశోక్‌నగర్ మీదుగా ఆర్టీసీ క్రాస్‌రోడ్డుకు రావాలనుకున్న సీఎం షెడ్యూల్ నిరుద్యోగులకు భయపడి చివరి నిమిషంలో మార్చుకున్నారు. అప్పటిదాకా అశోక్‌నగర్ రూట్ బంద్ చేసిన పోలీసులు ఒక్కసారిగా రూట్ మారిందన్న సమాచారంతో హిమాయత్‌నగర్, నారాయణగూడ, చిక్కడపల్లి వరకు అలర్ట్ చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ రెండేండ్ల కిందట ఇచ్చిన హామీని రేవంత్‌రెడ్డి తుంగలో తొక్కారని నిరుద్యోగులు ఆగ్రహించారు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండానే మాయమాటలతో రేవంత్‌రెడ్డి మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. ఉద్యోగం లేక ఆవేదనతో ఆందోళన దిగిన తమపై లాఠీలు ఝులిపించడం, అరెస్టులతో చిత్రహింసలకు గురిచేసిన వైఖరిపై విరుచుకుపడ్డారు.
చిక్కడపల్లి ప్రాంతమంతా పోలీసుల వలయంగా మారింది. ఒక ప్రైవేటు మాల్ ఓపెనింగ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి వచ్చిన నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని పోలీసులు దిగ్బంధించారు. అక్కడ దుకాణాలు మూసివేయడమే కాకుండా పనిచేయడానికి వచ్చిన కార్మికులను వెనక్కి పంపారు. హిమాయత్‌నగర్, నారాయణగూడ మీదుగా వచ్చిన సీఎం మాల్ ఓపెన్ చేసి వెళ్లిపోయేవరకు ఇదే పరిస్థితి కనబడింది. ఈ క్రమంలోనే సీఎం రూట్ మారడంతో శుక్రవారం ఉదయం ఏడుగంటల నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, చిక్కడపల్లి, గాంధీనగర్ ప్రాంతంలో మళ్లీ పోలీసులు భారీగా మోహరించారు. అన్నిచోట్లా బారికేడ్లు పెట్టి, ప్రణాళిక లేకుండా ట్రాఫిక్ ఆంక్షలు పెట్టడంతో జనం పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాఫిక్‌జామ్‌తో నగరవాసులు మండిపడ్డారు.