హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి గత నెల 16వ తేదీన ఢిల్లీకి వెళ్లి బనకచర్లకు పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు బనకచర్లను వ్యతిరేకిస్తాం, ఎంతవరకైనా వెళ్తాం అంటూ బీరాలు పలికిన రేవంత్‌రెడ్డి తీరా ఢిల్లీలో సంతకాలు పెట్టి రావడంపై ఇప్పటికే కాంగ్రెస్‌లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నది.
ఢిల్లీ పర్యటన తర్వాత జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలోనూ బనకచర్ల అంశం ప్రధాన ఎజెండాగా చర్చ జరిగినట్టు తెలిసింది. ఈ సందర్భంగా ఓ సీనియర్ మంత్రి లేచి ‘తెలంగాణకు ఏమాత్రం ప్రయోజనం లేని ప్రాజెక్టు గురించి మనం ఎందుకు ఉరుకులాడుతున్నాం?’ అని సీఎంను గట్టిగా నిలదీసినట్టు సమాచారం. సాగునీటి రంగ సలహాదారు ఆధిత్యనాథ్ దాస్ ఎలాంటి సలహాలు ఇస్తున్నారని? బనకచర్లపై నిర్ణయం తెలంగాణలో పార్టీని నిండా ముంచేలా ఉన్నదని మండిపడ్డట్టు తెలిసింది. ‘మన రాష్ట్రంలో నీళ్లతో ఆటాడటం అంటే నిప్పుతో చెలగాటమనే విషయం మీకు తెలియదా?’ అని ఘాటుగానే నిలదీశారట. మరో సీనియర్ మంత్రి 7వ పేజీలో
సైతం ఆయనకు జతకలిశారని, ‘బనకచర్ల మీద హైదరాబాద్‌లో మన వైఖరి ఏమిటి? తీరా ఢిల్లీకి వెళ్లి చేసింది ఏమిటి?’ అని ప్రశ్నించారని సమాచారం. మీ అభిప్రాయాలను మంతివర్గంపై రుద్దడం ఏమిటని అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఆ ఇద్దరు సీనియర్ మంత్రులకు తోడు ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన జూనియర్ మంత్రి కూడా జత కలవడంతో సీఎం కొంత ఇబ్బంది పడ్డట్టు కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ జరుగుతున్నది.
‘మీ ట్రాప్‌లో చంద్రబాబు పడ్డారా? చంద్రబాబు ట్రాప్‌లో మీరు పడ్డారా? లేదా ఇద్దరు కలిసి మోదీ ట్రాప్‌లో పడ్డారా?’ అని గట్టిగానే ప్రశ్నించినట్టు సమాచారం. సమావేశంలో సైలెంట్‌గా ఉన్న మరికొందరు మంత్రులు, బయటికి వచ్చిన తర్వాత ముగ్గురు మంత్రులకు సంఘీభావం తెలిపినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు బనకచర్లపై సీఎం రేవంత్ తీరుకు నిరసనగా సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశానికి ఓ సీనియర్ మంత్రి డుమ్మాకొట్టినట్టు తెలిసింది. అధిష్ఠానానికి వీర విధేయుడైన ఆ మంత్రి హాజరుకాకపోవడం కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారిందట.
రేవంత్‌రెడ్డి ప్రధాని మోదీ మాయలో పడ్డారని, చంద్రబాబు ద్వారా మోదీ తన నిర్ణయాలు అమలు చేయిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నట్టు సమాచారం. నదుల అనుసంధానం అనేది ప్రధాని మోదీ మానస పుత్రిక అని, దానికి సీఎం రేవంత్‌రెడ్డి వంత పాడుతున్నారని అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. నీళ్లను కృష్ణా నది గుండా కావేరి నదిలోకి తీసుకువెళ్లడం ద్వారా త్వరలో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లను పండించుకోవాలని మోదీ స్కెచ్ వేశారని విశ్లేషిస్తున్నారు. మోదీ తన ఆలోచనలను చంద్రబాబుకు చెప్తే, ఆయన రేవంత్‌రెడ్డి సహకారంతో అమలు చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
వాస్తవానికి విజయవాడ ప్రజలు కూడా బనకచర్ల ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారని, పోలవరం నుంచి రోజుకు రెండు టీఎంసీల నీళ్లు తీసుకొచ్చి ప్రకాశం బరాజ్‌లో పోస్తే విజయవాడ ముగినిపోవటం ఖాయమని ప్రజలు ఆందోళన చెందుతున్నారని అంటున్నారు. అయినా ఏపీ సీఎం చంద్రబాబు, సీఎం రేవంత్‌రెడ్డి రెండు రాష్ర్టాల ప్రజల గోడును పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఈ మేరకు ముగ్గురు సీనియర్ కాంగ్రెస్ నేతలు పక్కా ఆధారాలతో జాతీయ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు, ఢిల్లీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. కృష్ణా, గోదావరి జలాలు, బనకచర్ల మీద మంత్రి వర్గ సమావేశాల్లో జరుగుతున్న చర్చ ఒకటైతే.. బయట ప్రకటిస్తున్న నిర్ణయాలు పూర్తి విరుద్ధంగా జరుగుతున్నాయని, మంత్రి వర్గ సమావేశాల మినిట్స్‌ను విడుదల చేస్తే అన్ని వివరాలు బయటికి వస్తాయని అధిష్ఠాన పెద్దలకు వివరించారట.
నదుల అనుసంధాన ప్రాజెక్టుకు సీనియర్ మంత్రి ఒకరు అడ్డంకిగా మారుతారని ‘కూటమి’ ఆరు నెలల కిందటే అంచనా వేసినట్టు ప్రచారం జరుగుతున్నది. కాంగ్రెస్‌కు విధేయుడు కావడంతో ఆయనను ఆ శాఖ నుంచి తప్పించాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. అందుకే ఆయన ఆధీనంలోని శాఖను ప్రభుత్వం అసలు పట్టించుకోలేదని, కొత్త పనులు చేపట్టడానికిగానీ, పాత పనులు పూర్తి చేయడానికిగానీ నిధులు కేటాయించడం లేదని చర్చ జరుగుతున్నది.
పైగా కూలుడు, విచారణలు, కమీషన్లు వంటి గొడవలు తప్ప రూపాయి ఆమ్దానీ లేని శాఖ ఎందుకు? అని ముఖ్యనేత సన్నిహిత వర్గం రెచ్చగొట్టినట్టు తెలిసింది. చివరికి ‘ఈ పదవి నాకు వద్దు’ అని ఆయన నోటితోనే చెప్పేదాకా పరిస్థితిని తీసుకొచ్చారని చెప్తున్నారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయనను ఆ శాఖ నుంచి తప్పించాలని భావించగా, ఎవరి శాఖలూ మార్చవద్దని అధిష్ఠానం ఆదేశించడంతో ప్లాన్ ఫెయిల్ అయినట్టు తెలిసింది.