సంగారెడ్డి, ఆగస్టు 2(నమస్తే తెలంగాణ) : జర్నలిస్టులు, పత్రికలపై కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీ ఎదురుదాడికి దిగుతున్నది. ఆ జర్నలిస్టు చెంప పగలగొట్టాలనిపిస్తున్నదని, అక్షరం ముక్కరాని వారు కూడా జర్నలిస్టులుగా చలామణి అవుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.. సీఎం రేవంత్‌రెడ్డి కంటే తానేమీ తక్కువకాదంటూ పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్ ‘నమస్తే తెలంగాణ’ పత్రికపై తన అక్కసు వెళ్లగక్కారు. నమస్తే తెలంగాణ పత్రిక అవాకులు చవాకులు రాస్తున్నదంటూ ఆక్రోశం వ్యక్తంచేశారు. శనివారం సంగారెడ్డి జిల్లా అందోల్ మండలంలోని సంగుపేట వద్ద జనహిత పాదయాత్రలో భాగంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో కాంగ్రెస్ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, మంత్రి దామోదర్, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎంపీ సురేశ్ షెట్కార్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ మాట్లాడుతూ నమస్తే తెలంగాణ పేపర్ జనహిత పాదయాత్రపై అవాకులు చవాకులు రాస్తున్నదని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా పాదయాత్ర జరుగుతున్నట్టు రాస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి, మీనాక్షి నటరాజన్, తాను కలిసికట్టుగా చర్చించి ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు ప్రజలకు వివరించేందుకు జనహిత పాదయాత్ర ప్రారంభించినట్టు వివరించారు.
బనచర్లపై తన వ్యాఖ్యలను నమస్తే తెలంగాణలో తప్పుగా రాశారని తెలిపారు. పరిగి, అందోల్ నియోజకవర్గాల్లో జరిగిన జనహిత పాదయాత్రలో పాల్గొన్న పీసీసీ చీఫ్ తన ప్రసంగాల్లో బనకచర్ల ప్రాజెక్టు పూర్తయ్యిందని పలుమార్లు పేర్కొన్నారు. ఇదే విషయాన్ని నమస్తే తెలంగాణ ‘బనకచర్ల నిర్మాణం పూర్తయిందట’ శీర్షకతో శుక్రవారం పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ అవగాహనలేమి వ్యాఖ్యలను ప్రచురించింది. అందోల్ కార్యకర్తల సమావేశంలో పీసీసీ చీఫ్ బనకచర్లపై తన మాటలను మార్చారు. తాను బనచర్ల ప్రాజెక్టు పూర్తయిందని ఎక్కడా అనలేదని బీఆర్ఎస్ హయాంలోనే బనకచర్ల ప్రాజెక్టు ప్రారంభం అయ్యిందని అన్నానని వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు.