హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ లెక్కచేయకుండా ప్రభుత్వ అధికారిక కార్యక్రమం పేరుతో పలు శంకుస్థాపనలు చేయడం ఎన్నికల కోడ్ను బాహాటంగా ఉల్లంఘించడమేనని పలువురు మండిపడుతున్నారు. ప్రభుత్వ సభను రాజకీయ సభగా మార్చిన రేవంత్రెడ్డి… ప్రజలపై హామీలు కురిపించారు. రేవంత్రెడ్డి ప్రవర్తన, వ్యాఖ్యలు కచ్చితంగా కోడ్ ఉల్లంఘన కిందికు వస్తాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. సీఎం హోదాలో ఉంటూ ఎన్నికల కోడ్ను అతిక్రమించడంపై విపక్షాల నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు పూర్తవుతున్న సందర్భంగా సోమవారం నారాయణపేట జిల్లా మక్తల్లో ‘ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాలు’ పేరుతో సభ నిర్వహించారు. ప్రభుత్వ అధికారిక సభను కాంగ్రెస్ రాజకీయ సభగా సాగిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ నడుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నది. కోడ్ ఉండగా ప్రభుత్వం ఓటర్లు ప్రభావితమయ్యే పనులు చేపట్టకూడదు. కానీ రేవంత్ మక్తల్, ఆత్మకూరు, అమరచింతలో శంకుస్థాపనలు చేశారు.
రాజకీయ వ్యాఖ్యలు… ప్రలోభ హామీలు
మక్తల్ సభను సీఎం రేవంత్రెడ్డి రాజకీయ సభగా మార్చారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేవంత్రెడ్డి సభ సర్పంచ్ ఎన్నికల ప్రచార సభను తలపించిందని, రేవంత్రెడ్డి రాజకీయ ప్రసంగం చేశారని ప్రతిపక్ష నేతలు తప్పుబడుతున్నారు. కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని రేవంత్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారని చెప్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఎలా ఆశీర్వదించారో ఇప్పుడు కూడా అలాగే ఆశీర్వదించాలని చెప్పడం ముమ్మాటికీ కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందని విశ్లేషిస్తున్నారు. దీంతోపాటు ఓటర్లను ప్రభావితం చేసేలా హామీలు ఇవ్వడం కూడా సరికాదని అంటున్నారు. వడ్డించేది తానేనని, కావాల్సినవి ఇస్తాననని చెప్పుకొచ్చారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ప్రాజెక్టును రెండేండ్లలో పూర్తిచేయకపోతే వీపు విమానం మోగుతుందని అధికారులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ గుండె పగలాలి
ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి చేసిన పలు వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. తనకు మద్దతుగా విజిల్ వేయాలంటూ అక్కడున్న యువకులకు సీఎం రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘ఢిల్లీకి వినిపించాలి.. ఒక్కొక్కని గుండె పగలాలి.. గుండెలు ఆగిపోవాలి’ అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ఉద్దేశించి చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అప్పటివరకు బీజేపీ గురించి ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అదే విధంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ ఢిల్లీలో లేదు. కాబట్టి ఢిల్లీ గుండెలు పగలాలి అని కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ఉద్దేశించే అన్నారనే చర్చ జరుగుతున్నది.