హైదరాబాద్, హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): రాజు తల్చుకుంటే కొరడా దెబ్బలకు కొదువా? అన్నట్టుగా సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ దిగ్గజ ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీతో (Lionel Messi) మ్యాచ్ ఆడాలనే తన కోరిక కారణంగా ఖజానాకు రూ.100 కోట్లు చిల్లు పెట్టడమే ఇందుకు నిదర్శనమని ప్రజలు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రికి ఫుట్‌బాల్ ఆడాలనే కోరిక పుడితే.. రాష్ట్ర ఖజానాను వాడుకోవాలా? కేవలం నాలుగు బంతులను కిక్ చేస్తూ ఫొటోలకు పోజులివ్వడానికి ఏకంగా రూ.5 కోట్లతో ప్రత్యేక స్టేడియం నిర్మించాల్సిన అవసరం ఏమున్నది? రాష్ట్రంలో క్రీడాకారులు సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతుంటే, సీఎం మాత్రం తన ఆర్భాటం కోసం ఇంత మొత్తాన్ని వృథా చేయడం ఏమిటి? ఇది ప్రజాపాలనా? లేక ప్యాలెస్ పాలనా? అని ప్రశ్నిస్తున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి తన సొంత సరదాల కోసం రాష్ట్ర ఖజానాను వాడుకుంటున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు గు ప్పిస్తున్నారు. మార్పు తీసుకొస్తామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. సొంత విలాసా లు, కుటుంబ వైభవానికి పరిమితమైనట్టు కనిపిస్తున్నదని విపక్షాలు మండిపడుతున్నాయి. ఒకవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నదని చెప్తూనే, మరోవైపు తన వ్యక్తిగత సరదాల కోసం ప్రజాధనాన్ని అడ్డగోలుగా ఖర్చు చేయడమేంటని నిలదీస్తున్నారు. పాలనను గాలికి వదిలేసి, సీఎం రేవంత్‌రెడ్డి, తన మనుమడితో ఫుట్‌బాల్ ఆడే సరదా కోసం.. ప్రజల పైసలు ఖర్చు పెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు.
ఉప్పల్ స్టేడియంలో శనివారం రాత్రి మెస్సీ మరికొందరు క్రీడాకారులతో కలిసి సీఎం రేవంత్ ఫుట్‌బాల్ ఆడారు. ఓ నాలుగు బంతు లు అటూ, ఇటు కిక్ చేశారు. తన మనువడితో కూడా కొన్ని బంతులను కిక్ చేయించారు. మ నుమడితో కలిసి కుటుంబ పిక్నిక్లా స్టేడియం లో సరదాగా గడిపారు. ఫొటోలకు పోజులిచ్చారు. మీడియాలో కనబడేటట్టుగా ఫుట్‌బాల్ డ్రెస్‌లో ఒకసారి ఎగిరిదూకారు. ఇంత ఆర్భాటం చేసినా సీఎం రేవంత్‌తో మెస్సీ ఆడ నే లేదు. మెస్సీ ఫుట్‌బాల్ డ్రెస్ కూడా వేసుకోలేదు. నమూనాకు చిన్న కోర్టులో కేవలం కొద్ది మందితో కాసేపు ప్రాక్టీస్ సెషన్‌లా మెస్సీ బాల్స్‌ను అటూ ఇటు కిక్ చేశారు. ఇందులో రేవంత్ ఇతర క్రీడాకారులు కాసేపు ఆడారు. ఇంత మాత్రం దానికి కొన్ని రోజులుగా రేవంత్ చేసిన హంగామా అంతా ఇంతా కాదని నె టిజన్లు ఫైరయ్యారు. మెస్సీ బాల్ ఇస్తే కనీసం రిటర్న్ పాస్ కూడా ఇవ్వలేని వ్యక్తి ఎవరు? అని రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇలాంటి ఓ ఆట కోసం.. భారీ మొత్తంలో ప్రజాధనాన్ని వెచ్చించడం దేశ చరిత్రలోనే ఎకడా జరిగి ఉండదని చెప్తున్నారు. ఇది కచ్చితంగా అధికార దుర్వినియోగమేనని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ఉప్పల్ స్టేడియంలో ఫుట్‌బాల్ ఆటకోసం సీఎం రేవంత్ భారీగా ప్రజాధనం ఖర్చుపెట్టారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగా ణ ప్రజల డబ్బు రూ.5 కోట్లు వెచ్చించి జూబ్లీహిల్స్‌లోని తన ప్యాలెస్‌కు సమీపంలో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం లో ఫుట్‌బాల్ టర్ఫ్ వేయించి కొన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు. వ్యక్తిగతంగా ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేయడానికి రేవంత్ రాష్ట్ర ఖజానాతో ప్రత్యేకం గా రోడ్లు వేయించారు. ముఖ్యమంత్రి కుటుంబసభ్యుల రాకపోకలకు ఇబ్బందులు కలుగకూడదని ఆగమేఘాల మీద కొత్త రోడ్లు నిర్మించారు. సామాన్య ప్రజలకు మాత్రం ట్రాఫిక్ ఆంక్షల పేరుతో నరకం చూపించారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్నదని, సంక్షేమ పథకాలకు కోత లు పెడుతున్న ప్రభుత్వం.. సీఎం కుటుంబం కోసం వందల కోట్లు ఖర్చు చేయడమేంటని నిలదీస్తున్నారు.
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం సమస్యల వలయంలో చిక్కుకున్నది. సమస్యల పరిష్కారం డిమాండ్‌తో ప్రజలు నిత్యం రోడ్డెక్కుతున్నారు. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్‌తో వి ద్యార్థులు దవాఖానల పాలవుతున్నారు. ఫీజు బకాయిలు చెల్లించాలని కాలేజీల యాజమాన్యాలు ఆందోళనబాట పట్టాయి. దవాఖాన ల్లో మందుల కొరత వేధిస్తున్నది. సన్నవడ్లకు బోనస్ డబ్బులు ఇవ్వడంలేదు. ఉద్యోగ విరమణ చేసిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వడంలేదు. ప్రభుత్వం రోడ్లు వేయాలని టెండర్ల కోసం పిలిస్తే.. ఒక్క కాంట్రాక్టర్ ముందుకు రాలేదు. రేవంత్ సర్కారు బిల్లులు ఇస్తుందన్న నమ్మకం లేదని చెప్తున్నారు. ప్రతి రంగాన్నీ నిర్లక్ష్యం చేస్తూ.. దివాలా తీశామని చెప్పుకుంటున్న రేవంత్.. కేవలం కొన్ని నిమిషాల ఆట కోసం, ప్రజలకు పైసా ఉపయోగం లేని ఆటకోసం వంద కోట్లు ఎలా ఖర్చు పెట్టారని ప్రజానీకం దుమ్మెత్తిపోస్తున్నారు.
మెస్సీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గోట్ ఇండియా టూర్లో భాగంగా శనివారం కోల్‌కతా నుంచి నేరుగా హైదరాబాద్‌కు వచ్చిన మెస్సీ.. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లారు. మెస్సీతోపాటు రోడ్రిగో, లూయిస్ వచ్చారు. ప్యాలెస్‌లో క్యూఆర్ కోడ్ పాసులున్నవారి నే అనుమతించగా.. 250 మంది మెస్సీని కలిశారు. కోల్‌కతాలో అభిమానులు ఆగ్రహంతో స్టేడియంలో సృష్టించిన గందరగోళాన్ని దృష్టిలో పెట్టుకుని, పోలీసులు ఉప్పల్ స్ట్టేడియం పరిసరాల్లో 3 వేల మందిని మోహరించారు.
డ్రోన్ కెమెరా లు, సీసీటీవీలతో స్టేడియం వద్ద భద్రత పర్యవేక్షించారు. మెస్సీ స్టేడియంలోకి వచ్చినప్పటి నుంచి తిరిగి వెళ్లే వరకు పోలీసులు, భద్రతా సిబ్బంది ఎవరినీ లోపలికి అనుమతించలేదు. అదనంగా 20 రోప్‌పార్టీలతో స్టేడియం చుట్టూ భద్రతను పెంచారు. మెస్సీని చూద్దామని ఉప్పల్ స్టేడియం వరకు వచ్చిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ఉప్పల్ స్టేడియానికి వెళ్లే మార్గాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కేవలం సీఎం సరదా కోసం ప్రజలను తిప్పలు పెట్టడమేంటని నగరవాసులు గరమయ్యారు.