హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): సీఎల్పీ నేత భట్టి విక్రమార్క లక్ష్యంగా కాంగ్రెస్‌లో కొం దరు పావులు కదుపుతున్నారా? ఆయనను ఓడించడమే లక్ష్యంగా స్కెచ్ వేస్తున్నారా? తద్వారా పార్టీలో తనకు పోటీ లేకుండా చేయాలనుకుంటున్నారా? భట్టిని ఓడించేందుకు ఓ నేతకు స్పెషల్టాస్క్ ఇచ్చారా? ఈ ప్రశ్నలకు అవుననే అభిప్రాయా లు వ్యక్తమవుతున్నాయి. దీనిపై గాంధీభవన్ వేదికగా పలువురు నేతలు గుసగుసలాడుతున్నారు. ఖమ్మం బహిరంగ సభ తర్వాత ఈ ఊహగానాలు మరింత జోరందుకున్నా యి. సొంత నియోజకవర్గంలో భట్టిని ఓడించి, తద్వారా రాజకీయంగా దెబ్బతీసే లక్ష్యంతోనే పొంగులేటిని రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
ఇందుకు తొలి అడుగు ఖమ్మం సభలోనే పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 109 రోజులు పాదయాత్ర చేసిన భట్టి విక్రమార్కకు సముచిత గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో పార్టీ అధిష్ఠానం ఖమ్మం సభను పొంగులేటి చేరిక సభ కాకుండా భట్టి పాదయాత్ర ముగింపు సభగా నిర్వహించాలని నిర్ణయించింది. కానీ రేవంత్, పొంగులేటి కలిసి ఈ స్ఫూర్తికి తూట్లు పొడిచారనే ప్రచారం జరుగుతున్నది. ఆ సభ ను హైజాక్ చేసిన ఈ ఇద్దరు నేతలు భట్టికి పేరు రాకుండా చేశారనే విమర్శలున్నా యి. ఈ సభను పొంగులేటి ఆర్థిక బలంతో చేరిక సభగా మార్చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
అడ్డులేకుండా ఉండేందుకేనా?
భట్టికి ఇటు పార్టీలో, అటు అధిష్ఠా నం వద్ద మంచి పేరున్నది. దీనికి తోడు పాదయాత్ర ద్వారా పార్టీలో తన స్థానా న్ని మరింత బలపర్చుకున్నారు. ఇది రేవంత్‌కు రుచించలేదనే గుసగుసలు వినిపిస్తున్నా యి. ప్రస్తుతం పార్టీలో రేవంత్‌కు గట్టి పోటీ ఇచ్చే నేతల్లో భట్టి ముందు వరుసలో ఉంటా రు. కాబట్టి భట్టిని పక్కకు తప్పిస్తే ఇక తనకు పెద్దగా పోటీ ఉండబోదని రేవంత్ భావిస్తున్నారనే టాక్ ఉన్నది. ఇందులో భాగంగానే ఆయనను ఓడించేందుకు పొంగులేటిని రంగంలోకి దింపి ఖమ్మం జిల్లాలో భట్టికి చెక్ పెట్టే వ్యూహానికి పదును పెట్టారనే విమర్శలున్నాయి.
రేణుక టార్గెట్‌గా పొంగులేటి స్కెచ్
ఒకవైపు పొంగులేటి ద్వారా భట్టిని రేవంత్టార్గెట్ చేశారనే ప్రచారం జరుగుతుంటే మరోవైపు రేణుకాచౌదరి టార్గెట్‌గా పొంగులేటి సొం త స్కెచ్ వేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఇద్దరి లక్ష్యం నెరవేరేలా ఆ ఇద్దరూ పరస్పరం సహకరించుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. కాంగ్రెస్‌లోకి పొంగులేటి చేరికను తొలి నుంచి రేణుకాచౌదరి వ్యతిరేకిస్తున్నారు. దీంతో పార్టీలో రేణుకాచౌదరి ప్రాబల్యాన్ని తగ్గించే దిశగా పొంగులేటి పావులు కదుపుతున్నారనే విశ్లేషణలు ఉన్నాయి.
పాత నేతలకు పాతర
కొంతకాలంగా పొంగులేటి ఖమ్మం జిల్లా వేదికగా సొంత రాజకీయం నెరుపుతున్నారు. కాంగ్రెస్‌లో చేరకముందే నియోజకవర్గాలవారీగా తన సొంత అభ్యర్థులను ప్రకటించుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరడంతో వారి పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పొంగులేటి తన అనుచరులకు టికెట్ హామీ పొందిన తర్వాతే పార్టీలో చేరారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో జిల్లాలో పాత తరం నేతలకు టికెట్లు కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.