అదే మోసం.. అదే కపట బుద్ధి.. రైతన్న జీవితంతో ఆటలాడే కుటిల రాజకీయం.. నిన్నమొన్నటివరకూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేసిన దుర్మార్గ ప్రకటనలు.. ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నోటివెంట వస్తున్నాయి. రైతులను నిండా ముంచి రాజకీయంగా ఎదగాలన్న దుర్నీతి, రాష్ట్రప్రభుత్వాన్ని బద్నాం చేయాలన్న దుర్బుద్ధి.. ప్రజలు ఏమనుకున్నా సరే.. తమ లక్ష్యాలు నెరవేరితే చాలన్న దుష్ట ఆలోచన.. ఇదే ఇప్పుడు రేవంత్‌రెడ్డి ఎంచుకున్న మార్గం. అధిష్ఠానం మొట్టికాయలతో తన రహస్య మిత్రుడు బండి సంజయ్ నోరుమూసుకోగానే, రేవంత్ అదే రాగం అందుకున్నారు.. యాసంగిలో వరిపంట వేయండి అని..
హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): బాయిల్డ్ రైస్ కొనబోమని కేంద్రప్రభుత్వం తెగేసి చెప్పిన తర్వాతకూడా యాసంగిలో వరిపంటే వేయాలని రైతులను రెచ్చగొట్టి నవ్వులపాలైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నోరుమూసుకోగానే.. మరో గొంతు అదే రాగం అందుకున్నది. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా ఇప్పుడు అదే పల్లవి అందుకొన్నారు. ‘యాసంగిలో వరి సాగు చేయండి.. ప్రభుత్వం ఎట్ల కొనదో నేను చూస్తా’ అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన యాసంగిలో వరి వేయాలని రైతులకు పిలుపునిచ్చారు. యాసంగిలో వచ్చే బాయిల్డ్ రైస్‌ను ఒక్క గింజకూడా కొనబోమని కేంద్రం తెగేసి చెప్పిన తర్వాత కూడా రేవంత్‌రెడ్డి రైతులను రెచ్చగొట్టి నిండా ముంచే కుట్రలకు తెరలేపారు. యాసంగిలో వరి సాగుచేస్తే ఆ ధాన్యాన్ని రేవంత్‌రెడ్డి కొనుగోలు చేస్తారా? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఏ అధికారమూ లేని రేవంత్‌రెడ్డి ఇలాంటి హామీ ఎట్లా ఇస్తారని మండిపడుతున్నారు.
రేవంత్‌రెడ్డి అజ్ఞానానికి కొన్ని మచ్చుతునకలు
రేవంత్‌రెడ్డి: పంటల మద్దతు ధర (ఎంఎస్పీ)కు చట్టబద్ధత ఉన్నది.
వాస్తవం: దేశంలో పంటలకు మద్దతు ధరపై ఎలాంటి చట్టం లేదు. ఒక విధానం మాత్రమే ఉన్నది. ప్రతి సీజన్లో కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ (సీఏసీపీ) ప్రతిపాదనలకు అనుగుణంగా కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) ఎంఎస్పీని నిర్ణయిస్తుంది. ఈ నేపథ్యంలో రైతుసంఘాలు మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని ఢిల్లీలో కొట్లాడుతున్నాయి.
రేవంత్‌రెడ్డి: రూ.10 వేల కోట్లు ఇస్తే మేమే ధాన్యం కొనుగోలు చేస్తం.
వాస్తవం: గత యాసంగిలో 92 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు రాష్ట్రప్రభుత్వం వెచ్చించిన మొత్తం రూ.17,500 కోట్లు. రవాణా, గన్నీ సంచులు, మిల్లింగ్, ఐకేపీ కేంద్రాల కమిషన్ కలిపితే ఇది రూ.20 వేల కోట్లకు పైగా అవుతుంది. మరి రేవంత్‌రెడ్డి రూ.10 వేల కోట్లకు ఎలా కొనుగోలు చేస్తరో ఆయనే చెప్పాలి.
రేవంత్‌రెడ్డి: ఇతర రాష్ర్టాల్లో నేరుగా కేంద్రమే పంట కొనుగోలు చేస్తున్నది. ఇక్కడ మాత్రం ప్రభుత్వం దళారీగా వ్యవహరిస్తున్నది.
వాస్తవం: దేశంలో ఎక్కడా కేంద్రం నేరుగా ధాన్యం కొనుగోలు చేయడంలేదు. గతంలో ఉన్న ఈ విధానాన్ని ఎత్తేసిందే కేంద్రంలోని గత కాంగ్రెస్ ప్రభుత్వం. డీ సెంట్రలైజ్జ్ ప్రొక్యూర్మెంట్ (డీసీపీ) విధానం అమలుచేసి ధాన్యం కొనుగోలు బాధ్యత నుంచి నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుకొన్నది.
రేవంత్‌రెడ్డి: ఇతర దేశాలకు రాష్ట్రం బియ్యం ఎగుమతి చేయాలి.
వాస్తవం: దేశంలో ఆహార ఉత్పత్తుల ఎగుమతులు, దిగుమతుల వ్యవహారం మొత్తం కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి అధికారమూ ఉండదు. పార్లమెంటు సభ్యుడిగా, టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డికి ఈ విషయం తెలియకపోవడం శోచనీయం.