Harish Rao | సీఎం రేవంత్ ఓ శాడిస్టిక్ ఫ్రెజర్లో పాలన కొనసాగిస్తున్నాడని.. ప్రభుత్వం, పాలనపై దృష్టి లేదంటూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు. గచ్చిబౌలి పీఎస్ ఎదుట ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇవాళ రాహుల్‌గాంధీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నడు. నన్ను ఎందుకు పోనివ్వరు.. నేను ప్రతిపక్ష నాయకుడిని ఏ రకంగా అరెస్ట్ చేస్తరని మాట్లాడుతున్నరు. నేను అడుగుతున్న రాహుల్ గాంధీ. ముందు నీ ముఖ్యమంత్రిని అడుగు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా మధుసూదనచారి లగచర్లకు వెళ్లారు. ఆయనను ఎందుకు అరెస్ట్ చేశారు ? లగచర్లలో మహిళల గొంతుపై కాళ్లుపెట్టి.. వాళ్ల భర్తలు, పిల్లలను అరెస్ట్ చేస్తే.. ఆ కుటుంబాలను పరామర్శించేందుకు, ధైర్యం చెప్పేందుకు ప్రతిపక్ష నాయకుడిగా వెళ్తే ఆయనను అరెస్టు చేశారు కదా. ప్రజాసంఘాలు, పీవోడబ్ల్యూ సంధ్య.. సభ్యులందరినీ నడిరోడ్డపై బట్టలు చింపి అరెస్ట్ చేశారు కదా? ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది? రాహుల్ గాంధీ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే ముందు రేవంత్‌రెడ్డిని సక్కగ చెయ్. ఆయనకు ఆదేశాలు ఇవ్వు. నీకు వినకపోతే తొలగించు’ అంటూ హరీశ్‌రావు సూచించారు.
‘ఇవాళ రేవంత్ ఫస్ట్రేషన్ అర్థమవుతుంది. ఢిల్లీకిపోతే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరుకతలేదు. ఈ మధ్య ఐదారు ట్రిప్పులు కొట్టినా ఢిల్లీలో రాహుల్ అపాయింట్మెంట్ దొరకలేదు. ఎవడు కుర్చీగుంజుకుంటడో అనే ఫస్ట్రేషన్లో ఉంది. మంత్రులు ఆయన మాట వింటున్న పరిస్థితి లేదు. ఆ ఫస్ట్రేషన్లో.. శాడిస్టిక్ ఫ్రెజర్లో పాలన కొనసాగిస్తున్నడు. ఆయనకు ప్రభుత్వం, పాలనపై దృష్టి లేదు. ఎంతసేపూఎక్కడ డబ్బులు సంపాదించాలి. పత్రిపక్షాలపై అక్రమ కేసులు పెట్టాలి.. వేధించాలన్న దానిపై పని చేస్తున్నడు తప్ప.. పాలన గాలికి వదిలేసిండు. ఏడాది పాలనలో ఏ వర్గం బాగుపడింది. మహిళలకు ఏమన్నా చేశావా రేవంత్? మహిళా సంఘాలకు రూ.లక్ష కోట్ల వడ్డీలేని రుణం అన్నవ్.. అది భోగస్. కేసీఆర్ రూ.5లక్షలకే వడ్డీ లేని రుణం ఈ రాష్ట్రంలో వర్తిస్తుంది. నీ లక్ష కోట్ల వడ్డీలేని రుణం భోగస్. మహిళలకు నువ్వు చెప్పిన మహాలక్ష్మి భోగస్. ఇవాళ రేవంత్‌రెడ్డి మంచి సలహాలు, సూచనలు ఇవ్వాలని అంటున్నడు. మేం చాలా సలహాలు ఇస్తున్నాం. మేం నీ పాలనను అడ్డుకుంటలేం కదా..? నువ్వు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తానని బాండ్ పేపర్‌పై నువ్వో ఓ వైపు.. భట్టి విక్రమార్క ఓ వైపు సంతకాలు పెట్టి కాళ్లువేళ్లు పట్టుకొని ఓట్లు వేయించుకున్నరు’ గుర్తు చేశారు.
‘వందరోజులు కాదు.. నీ పాలనకు 365 రోజులైంది. నీ ఆరు గ్యారంటీలు అమలు చేయాలని అడుగుతున్నం. ఇది తప్పా? నువ్వు రైతులకు వరంగల్‌లో డిక్లరేషన్‌లో తొమ్మిది హామీలు ఇచ్చావు. ఇందులో ఒక్క హామీ అమలు కాలేదు. అమలు చేయాలని అంటున్న ఇది తప్పా? ఇది సూచన కాదా? నువ్వు చెప్పిన రూ.15వేల రైతుబంధు ఇవ్వు. రెండుసార్లు కాదు మూడుసార్లు రైతుబంధు ఇవ్వు అని ఆ రోజు కేసీఆర్‌ను అడిగినవ్. గా మూడుసార్లు రైతుబంధు ఇవ్వు రేవంత్‌రెడ్డి అని అన్నం. నిన్ను అడ్డుకుంటున్నమా? నువ్వు అడిగిన మాటలే.. చెప్పిన మాటలే గుర్తు చేస్తున్నం. అవ్వాతాతలకు రూ.4పెన్షన్ ఇస్తా.. ఇందిరమ్మ రాజ్యం వస్తది అన్నవ్. ఆ పింఛన్ ఎప్పుడిస్తవని గుర్తు చేస్తున్నాం.. ఇది తప్పా? మూసీలో పేదల ఇండ్లు కూల్చకు.. హైడ్రా పేరుతో గరీబోళ్ల ఇండ్లు కూలగొట్టకు అన్నం.. ఇది సూచన కాదా? మూసీపై అఖిలపక్షం పిలువు.. మేం వచ్చి సూచనలు ఇచ్చేందుకు మేం రెడీగా ఉన్నామని చెప్పాం. అఖిలపక్షం పిలిచే మొఖం నీకు లేకపోయే. ఇది సూచన కాదా? సూచన తీసుకునే సోయి నీకు లేదు. ఆ విజ్ఞత నీకు లేదు. ముఖ్యమంత్రిగా నువ్వు బిహేవ్ చేయడం లేదు. ఒక గల్లీనాయకుడిగా, ముఠా నాయకుడిగా.. ఓ ఫ్యాక్షనిస్ట్‌గా.. కక్ష, పగతో ప్రతిపక్షాలపై వ్యవరిస్తున్నవ్. ఇవాళ చట్టం కాంగ్రెస్ పార్టీ చుట్టమైపోయింది ఈ రాష్ట్రంలో. చట్టాన్ని విచ్చలవిడిగా వాడుకుంటున్నవ్. ఇవాళ మమ్మల్ని పోలీస్‌స్టేషన్‌కు తెచ్చినవ్’ అంటూ హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.