వరంగల్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే సీఎం రేవంత్‌రెడ్డి జీహెచ్ఎంసీలో శివారు మున్సిపాలిటీలను విలీనం చేయాలని చూస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ప్రజల గడప వద్దకు ప్రభుత్వం చేరాలని.. కేసీఆర్ పాలనను వికేంద్రీకరిస్తే.. అధికారం పేరుతో దోచుకోవడాన్నే రేవంత్‌రెడ్డి పాలసీగా ఎంచుకున్నారని నిప్పులు చెరిగారు. పారిశ్రామిక వాడలకు చెందిన భూములను అప్పనంగా తన వందిమాగదులకు కట్టబెట్టేందుకు రేవంత్‌రెడ్డి స్కెచ్ వేశారని ధ్వజమెత్తారు.
అపార్ట్మెంట్లు, మాల్స్ కోసం పరిశ్రమల భూములను కేటాయిస్తారా? అని ప్రశ్నించారు. ప్రస్తుత, భవిష్యత్తు అవసరాల కోసం వినియోగించాల్సిన ప్రభుత్వ భూములపై కన్నేసి.. లక్షల కోట్లను కొల్లగొట్టాలని రేవంత్‌రెడ్డి చూస్తున్నారని, తక్షణమే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయంపై బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. బుధవారం వరంగల్ జిల్లాలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్‌పార్క్‌ను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘ఏ ఒక్క మున్సిపాలిటీలో తీర్మానం చేయకుండా, ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోకుండా, అఖిలపక్ష సమావేశం పెట్టకుండా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మున్సిపాలిటీల విలీన నిర్ణయం తీసుకున్నది. శాసనసభ సమావేశం పెట్టి, సభ్యుల అభిప్రాయం తీసుకోకుండా విలీనం చేయటం దుర్మార్గం’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరి ఎజెండా కోసం విలీన నిర్ణయం తీసుకున్నారో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.
విలువైన భూములను అడ్డికిపావుశేరు… అప్పనంగా కాజేయటం కోసమే రేవంత్‌రెడ్డి సర్కార్ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీని తీసుకొచ్చిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. ‘రైతులను ఒప్పించి, మెప్పించి కాకతీయ మెగా టెక్స్‌టైల్‌పార్క్ కోసం ఆనాడు ఇక్కడ (వరంగల్‌లో) సేకరించినట్టే, గత ప్రభుత్వాలు హైదరాబాద్‌లో 9,300 ఎకరాలు 21 పారిశ్రామిక వాడల్లో పరిశ్రమల కోసం భూములు సేకరించాయి. ప్రస్తుతం ఆ భూముల్లో అపార్ట్మెంట్లు, విల్లాల నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారు’ అని మండిపడ్డారు. పారిశ్రామికవేత్తలు అడ్డికిపావుశేరుకు కొనుకున్న, ప్రభుత్వం ఇచ్చిన భూములను ఇష్టం వచ్చినట్టు అమ్ముకుంటే రేవంత్‌రెడ్డి పచ్చజెండా ఊపుతున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు.
రేవంత్‌రెడ్డి పాలనలో అవినీతి రాజ్యమేలుతున్నదని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ‘హైదరాబాద్ భూములు తెలంగాణ ప్రజల సొత్తు. హైదరాబాద్ పారిశ్రామిక వాడలు తెలంగాణ ప్రజల నుంచి తీసుకున్న భూములు. వాటిని ప్రజల అవసరాల కోసం వినియోగించాలి. హైదరాబాద్‌లో కాలుష్యకారక పరిశ్రమలను తరలించేందుకే కేసీఆర్ గతంలో ఫార్మాసిటీ నిర్ణయం తీసుకున్నారు. కొత్త టెక్నాలజీతో కాలుష్యం రాకుండా ఫార్మా కంపెనీలను తరలించి, ఇక్కడ ఉండే భూముల్లో 50 శాతం ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి అనేది మా ఆలోచన అయితే… ఫ్యూచర్‌సిటీని రియల్ఎస్టేట్ పేరిట అమ్ముకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచనగా మారింది. హైదరాబాద్‌లోని 9,300 ఎకరాలను అమ్మి, తెలంగాణను రాహుల్ గాంధీకి ఏటీఎం, పేటీఎంగా రేవంత్‌రెడ్డి మార్చారు. రేవంత్‌రెడ్డి అవినీతి అనకొండగా అవతారం ఎత్తారు’ ’ అని కేటీఆర్ విమర్శించారు.
బీసీలకు 42శాతం అమలు చేశామని గొప్పలు చెప్పుకున్న రాహుల్‌గాంధీ, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42శాతం బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి తీరా 17 శాతం కూడా అమలు చేయని రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. పార్టీ సింబల్ లేకుండా జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పిస్తామని రేవంత్‌రెడ్డి పేర్కొనడం దారుణమన్నారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన రాహుల్‌గాంధీ.. తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేశామంటూ పచ్చి అబద్ధాలు ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. తెలంగాణలోని బీసీ రిజర్వేషన్లను రేరా (రేవంత్ రాహుల్) మాడల్ అని చెప్పుకొని తిరిగి, ఇప్పుడు తడిగుడ్డతో బీసీల గొంతు కోశారని మండిపడ్డారు. బీసీలకు రేవంత్‌రెడ్డి కనీసం 17శాతం కూడా కల్పించడంలేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల పట్ల రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై బీసీ మేధావులు, బుద్ధిజీవులు, ప్రజలు ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.