హైదరాబాద్, జూన్ 9(నమస్తే తెలంగాణ): రేవంత్‌రెడ్డి.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని మభ్యపెట్టడం కాదు.. ముందు అంగన్వాడీ సిబ్బందికి రెండు నెలల వేతనాలు చెల్లించాలని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. రెండు నెలలుగా జీతాలందక 62వేల మంది అంగన్వాడీ సోదరీమణులు పడుతున్న ఆర్థిక ఇబ్బందులు కనిపించడం లేదా? అని మంగళవారం ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నించారు. మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రిగా ఉన్న సీతక్క.. తోటి మహిళల కన్నీటి గోస అర్థం చేసుకోకపోవడం శోచనీయమని, వెట్టిచాకిరీ చేయించుకొని నెలల తరబడి వేతనాలివ్వకుండా వేధిస్తున్న కాంగ్రెస్ సర్కార్‌కు ఆ ఆడబిడ్డల ఉసురు తప్పక తగులుతుందని మండిపడ్డారు.
అంగన్వాడీల సేవలను గుర్తించిన కేసీఆర్.. వారు వర్కర్లు కాదని.. అంగన్వాడీ టీచర్లు అని పోస్ట్‌ను ఉన్నతీకరించి వారి గౌరవాన్ని పెంచారని హరీశ్ గుర్తుచేశారు. 2014 నాటికి టీచర్లకు రూ.4,200, హెల్పర్లకు రూ.2,200 వేతనం ఉండేదని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన టీచర్ల వేతనాన్ని రూ.13,650, మినీ అంగన్వాడీల వేతనాన్ని రూ.7,800, హెల్పర్ల వేతనాన్ని రూ.7,800లకు పెంచి దేశంలోనే అత్యధికంగా చెల్లించారని చెప్పారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో టీచర్ల వేతనాన్ని రూ.18వేలకు పెంచి, ఈపీఎఫ్ పరిధిలోకి తీసుకొచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తామని ప్రకటించారని కానీ ఆ హామీలకు ఇప్పటికీ అతీగతీ లేదని ధ్వజమెత్తారు.
అలవికాని హామీలతో అరచేతిలో వైకుంఠం చూపిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చిన తర్వాత అబద్ధపు ప్రచారంతో కాలం గడుపుతున్నదని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. సమస్యల పరిష్కారానికి చలో సెక్రటేరియట్‌కు పిలుపునిచ్చిన అంగన్వాడీ సిబ్బందిపై కర్కశంగా వ్యవహరించిన నీచమైన చరిత్ర కాంగ్రెస్‌ది అని దుయ్యబట్టారు. ‘ముఖ్యమంత్రి.. ఇప్పటికైనా కండ్లు తెరువండి.. మీ రెండున్నరేండ్ల పాలనను అన్నివర్గాల ప్రజలు ఛీ కొడుతున్నారనే విషయాన్ని గుర్తించండి’ అని హితవు పలికారు. ఏప్రిల్, మే నెలల వేతనాలతో పాటు అప్‌గ్రేడ్ చేసిన మినీ అంగన్వాడీలకు ఏడాదిగా పెండింగ్‌లో ఉన్న పెంచిన వేతనాలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.