హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): గ్రామాల్లో వీధి దీపాల ఏర్పాటు, వాటి నిర్వహణ బాధ్యతను సర్పంచ్లకే అప్పగించాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో అవసరమైనన్ని కొత్త ఎల్ఈడీ లైట్లను అమర్చటంతోపాటు వాటిని సమర్థంగా నిర్వహించే అధికారం గ్రామ పంచాయతీల పరిధిలోనే ఉండాలని స్పష్టంచేశారు. ఈ మేరకు సోమవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో మున్సిపల్, పంచాయతీరాజ్, జీహెచ్ఎంసీ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గ్రామాల్లో ఇప్పటికే ఉన్న ఎల్ఈడీ లైట్లు వెలుగుతున్నాయా లేదా కొత్తగా ఎన్ని అవసరమున్నాయో పకాగా అంచనా వేయాలని, ప్రతి పోల్ సర్వే చేయాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులను ఆదేశించారు. రాత్రిపూట ఎల్ఈడీ లైట్లు పనిచేయటంతోపాటు పగటిపూట దుర్వినియోగం కాకుండా పర్యవేక్షణ ఉండాలని, అన్ని గ్రామాల ఎల్ఈడీ డ్యాష్ బోర్డు మండల స్థాయిలో ఎంపీడీవో పర్యవేక్షణలో ఉండాలని చెప్పారు. జిల్లాలో అడిషనల్ కలెక్టర్కు ఈ బాధ్యతలు అప్పగించాలని అన్నారు.