హైదరాబాద్, ఆగస్టు 21(నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్‌రెడ్డి గురువారం నాటి తన ఢిల్లీ టూర్ రద్దు చేసుకోవడం రాజకీయవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. వాస్తవానికి ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి బీ సుదర్శన్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి సీఎం హాజరుకావాల్సి ఉంది. ఇందుకోసం ఆయన ఢిల్లీ టూర్ షెడ్యూ ల్ కూడా ఖరారైంది. వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఢిల్లీ పర్యటన కోసం గురువారం రాష్ట్రంలోని పలు కార్యక్రమాలను కూడా రద్దు చేసుకున్నారు. కానీ చివరి నిమిషంలో తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీకి ఎందుకు పోలేదనేది రాజకీయ వర్గాల్లో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇండియా కూటమి తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని తానే నిలబెట్టించానని రేవంత్ ఘనంగా ప్రకటించుకున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం కూడా చేయించుకున్నారు.
దీంతో జస్టిస్ రెడ్డి నామినేషన్ ఘట్టంలో రేవంత్ ప్రముఖంగా కనిపిస్తారని అందరూ అనుకున్నారు. నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్తున్నట్టు ప్రకటించుకున్న ఆయన అకస్మాత్తుగా టూర్‌ను రద్దుచేసుకోవడం అనేక అనుమానాలకు దారితీస్తున్నది. గురువారం రాష్ట్రంలో కూడా ఆయన ఏ కార్యక్రమంలోనూ పాల్గొనలేదు. ఆయనకు కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి పిలుపు రాలేదా? లేక బీజేపీకి ఎదురు నిల్చున్నానని భయపడ్డారా? లేదా సుదర్శన్‌రెడ్డి ఎంపికలో ఆయన పాత్ర లేదా? అనే ప్రశ్నలు పార్టీలో వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఎంపిక తనదేని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పుకొన్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఒకవేళ ఇదే నిజమైతే సుదర్శన్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి ఆయన కచ్చితంగా హాజరుకావాలి. కానీ సీఎం రేవంత్‌రెడ్డికి బదులుగా డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఈ కార్యక్రమానికి హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది. సీఎం ఎందుకు ఢిల్లీ వెళ్లలేదు? కార్యక్రమానికి ఎందుకు డుమ్మా కొంటారనే అంశంపై తెగ చర్చలు జరుగుతున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు ప్రధాని మోదీకి తనపై కోపం రాకుండా ఉండేందుకే రేవంత్ చివరి నిమిషంలో ముఖం చాటేసినట్టు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
మోదీతో ఎందుకు పెట్టుకుంటున్నావు అంటూ తన శ్రేయోభిలాషులు ఫోన్ చేసి సున్నితంగా హెచ్చరించినట్టుగా తెలిసింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీతో ఢీ అంటే ఢీ అనే విధంగా ఎందుకు వెళుతున్నావని ప్రశ్నించినట్టుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. వారి కంట్లో పడొద్దని, ఇది నీ రాజకీయ భవిష్యత్తుకు శ్రేయస్కరం కాదని ఘాటుగా హెచ్చరించినట్టు తెలిసింది. దీనిపై స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి.. తానేం తప్పు చేస్తున్నానని సదరు వ్యక్తిని ప్రశ్నించినట్టుగా తెలిసింది. తన పార్టీ తరఫున అభ్యర్థిని సూచించి, నిలబెట్టి ఆయన తరఫున ప్రచారం చేస్తున్నానని, ఇది తప్పెలా అవుతుందని ఆయన ఎదురు ప్రశ్నించినట్టు తెలిసింది. దీనిపై స్పందించిన సదరు శ్రేయోభిలాషి ‘నీ దృష్టిలో ఇది తప్పుకాకపోవచ్చు. కానీ వారు మాత్రం తప్పుగా భావిస్తున్నారు. నువ్వు ఎక్కువ హడావుడి చేస్తున్నావని అనుకుంటున్నారు’ అని చెప్పినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన వెనక్కి తగ్గి హఠాత్తుగా తన పర్యటనను రద్దు చేసుకున్నట్టు కాంగ్రెస్‌లో జోరుగా చర్చ జరుగుతున్నది.