హైదరాబాద్, జూన్ 11(నమస్తే తెలంగాణ) : ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డికి మరోసారి భంగపాటు ఎదురైందా? పాత మంత్రుల శాఖల మార్పు చేయాలన్న రేవంత్ ప్రయత్నానికి అధిష్ఠానం రెడ్ సిగ్నల్ వేసిందా? సీఎం ప్రతిపాదనలను ఢిల్లీ పెద్దలు పక్కన పడేశారా? మూడు రోజులపాటు ఢిల్లీలోనే మకాం వేసినా, మరోసారి రాహుల్‌గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదా?.. ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ ఇది. పైగా, బుధవారం జరిగిన పరిణామాలను విశ్లేషిస్తే అవుననే సమాధానం వస్తున్నది. అధిష్ఠానం పిలుపుతో ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి మూడు రోజులపాటు ఢిల్లీలో ఉన్నా భంగపాటు తప్పలేదనే చర్చ జరుగుతున్నది. ఇద్దరు మంత్రులకు చెందిన ముఖ్య శాఖలను మార్చాలని సీఎం భావించగా ఢిల్లీ పెద్దలు ఒప్పుకోలేదని, ఆయన దగ్గర ఉన్న కీలక శాఖలకే ఎసరొచ్చిందని చెప్పుకుంటున్నారు. అందుకే వివేక్ వెంకట స్వామికి గనుల శాఖను కేటాయించాల్సి వచ్చిందన్న ప్రచారం జరుగుతున్నది. శాఖల మార్పుపై తన మాట నెగ్గకపోవడంతో సీఎం యూటర్న్ తీసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. తనకు ఎదురైన భంగపాటును కప్పిపుచ్చుకునేందుకు విశ్వప్రయత్నం చేసినట్టు చెప్తున్నారు.
వరుసగా వచ్చివెళ్తున్నా అధిష్ఠానం తన ప్రతిపాదనలను పక్కన పెట్టేస్తుండటంతో దానిని కప్పిపుచ్చుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో చిట్‌చాట్ పేరుతో మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. డిప్యూటీ సీఎం, పార్టీ వ్యవహారాల ఇన్చార్జి లేకుండా శాఖల కేటాయింపుపై ఎలా నిర్ణయం తీసుకుంటామని, హైదరాబాద్‌కు వెళ్లి చర్చించి శాఖలు కేటాయిస్తానని సీ ఎం చిట్‌చాట్ సందర్భంగా చెప్పారు. అయితే సీఎం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకునేలోగానే శాఖల కేటాయింపుపై అధిష్ఠానం నుంచి స్పష్టత వచ్చినట్టు సమాచారం. ఢిల్లీలో జరిగింది ఒకటైతే, చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పింది మరొకటని, ఇందుకు ఆయన తడబాటే నిదర్శనమని ఢిల్లీ మీడియా వర్గాల్లో చర్చ జరుగుతున్నది. తెలంగాణలో జరిగిన కులగణనను కర్నాటక సీఎం, డిప్యూటీ సీఎంకు వివరించేందుకు వచ్చానని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ సమక్షంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు ప్రజెంటేషన్ ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు. పైగా.. ‘రాహుల్, రేవంత్ రేర్ కాంబినేషన్’ అని చిట్‌చాట్‌లో సీఎం చెప్పినట్టు సమాచారం. అ యితే కాంగ్రెస్ విడుదల చేసిన ఫొటోల్లో రా హుల్, ఖర్గేతోపాటు కర్ణాటక నేతలు మాత్రమే ఉన్నారు. ఒకవేళ రేవంత్ రెడ్డి చెప్పిందే నిజమైతే ఆ ఫొటోల్లో ఆయన ఎందుకు లేరన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదే విషయాన్ని ఢిల్లీ విలేకరులు సీఎంను ప్రశ్నించగా, ప్రజెంటేషన్ ఇస్తుంటే తాను ఫొటోలో ఎలా ఉంటానంటూ బుకాయించినట్టు చెప్తున్నారు. దీంతో అనుమానాలు మరింత పెరిగాయి. పైగా సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఢిల్లీకి వెళ్లగా, కర్ణాటక నేతలు మంగళవారం చేరుకున్నట్టు చెప్తున్నారు. ఒకవేళ కులగణనపై చర్చించేందుకే ఢిల్లీకి వెళ్తే కర్ణాటక నేతలు ముందు రావాల్సిందిపోయి రేవంత్‌రెడ్డి ఒకరోజు ముందే ఎం దుకు హస్తినకు చేరుకున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఎవరు కలిసినా ఆ ఫొటో కొద్ది సేపటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇటీవల పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ కుటుంబం కలిసిన ఫొటోలు విడుదల చేయడమే ఇందుకు ఉదాహరణ. మంగళవారం కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో చర్చించిన ఫొటోలు కూడా వెంటనే బయటికి వచ్చాయి. మరి రేవంత్‌రెడ్డితో ఫొటో మాత్రం ఎందుకు బయటకు రావడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై కేంద్రం స్పష్టత ఇవ్వకపోతే, పార్టీ తరుపున టిక్కెట్లు ఇస్తామని చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వంలో, పార్టీలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించి సామాజిక న్యాయం పాటిస్తామని చెప్పుకొచ్చారట. అయితే ఇదంతా మాటల వరకే అని కాంగ్రెస్‌లోని అసంతృప్త బీసీ నేతలు మండిపడుతున్నారు.
తాను అధికారంలో ఉన్నంతవరకు కేసీఆర్ కుటుంబ సభ్యులకు కాంగ్రెస్‌లోకి రానీయనంటూ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దీనిపై రాజకీయ విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అసలు కేసీఆర్ కుటుంబ సభ్యుల్లో కాంగ్రెస్‌లోకి వస్తానన్నది ఎవరు? అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఘర్ వా పసీ కోసం ప్రయత్నిస్తున్నారని, ఎంత ప్రయత్నించినా కొత్తగా ఎవరూ కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు ఇష్టపడడం లేదని గుర్తు చేస్తున్నారు.
కిషన్‌రెడ్డితో కలిసి పనిచేసేందుకు, ప్రాజెక్టులపై సమీక్షించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దీంతో బీజేపీతో తన బంధాన్ని బలోపేతం చేసుకునేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మోదీని బడే భాయ్ అని సంబోధించిన విషయాన్ని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇటీవలే తనది బీజేపీ స్కూల్ అని, టీడీపీ కాలేజీ అని, ఉద్యోగం రాహుల్ వద్ద చేస్తున్నానంటూ వ్యాఖ్యానించారని, తాజా వ్యాఖ్యలతో తాను బీజేపీతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాననే సంకేతాలను సీఎం పంపినట్టు అవుతున్నదని పార్టీ నేతలు వాపోతున్నారు. ఉద్యోగం ఒక దగ్గర మానేస్తే మరో దగ్గర చేస్తారని, దీనిని బట్టి కాంగ్రెస్‌లో మానేసి బీజేపీలో చేస్తారేమో? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.