హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): నిరుద్యోగులు, నిరుపేదల ఆకలి తీర్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన అన్నపూర్ణ క్యాంటీన్ల పేరును మార్చొద్దన్న వారిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అక్కసు వెళ్లగక్కారు. శుక్రవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో పీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సామాజిక న్యాయ సమరభేరి సభలో సీఎం రేవంత్‌రెడ్డి ఎప్పటిలాగే నోటికి అడ్డూ అదుపూ లేకుండా మాట్లాడారు. ఐదు రూపాయలకు భోజనం క్యాంటీన్లకు ఇందిరమ్మ పేరు పెట్టొద్దని ధర్నాలు చేసే వాళ్లను ఒక్కొక్కన్ని బట్టలిప్పి కొడితే తప్ప, ఇందిరమ్మ గొప్పతనం వారికి అర్థం కా దంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రూ.5 భోజన పథకం నుంచీ, ఇండ్ల నిర్మాణం వరకు అన్ని కార్యక్రమాలు ఇందిరమ్మ స్ఫూర్తితోనే అమలవుతున్నాయని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే పెండింగ్ నోటిఫికేషన్లు ఇచ్చి, నియామకాలు జరగని ప్రభుత్వ ఉద్యోగాలను గుర్తించి, 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఆ 60 వేల మందిని ఇదే ఎల్బీ స్టేడియంలో నిలబెట్టి మరీ లెక చెప్తామని, అందులో ఒకటి తప్పినా నేను కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్తానంటూ ప్రధాని మోదీ, మాజీ సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి సవాల్ విసిరారు. ఉద్యోగ నియామకాలపై చర్చకు వచ్చేందుకు కేసీఆర్, కిషన్‌రెడ్డి, మోదీకి దమ్ము ఉన్నదా? అని ప్ర శ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఎన్ని ఆ రోపణలు చేసినా తమ ప్రభుత్వం స్పష్టతతో పనిచేస్తున్నదని అన్నారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన కులగణనను కేవలం ఒకే ఏడాదిలోనే పూర్తి చేశామని చెప్పారు. ఇది సామాజిక న్యాయానికి మూలాధారం అవుతుందని, అన్ని వర్గాల వాస్తవ స్థితిగతులపై స్పష్టమైన సమాచారం సమకూరుతుందని పేర్కొన్నారు. ప్రజల మద్దతుతో ముందుకెళ్తా మని స్పష్టం చేశారు.
రైతురాజ్యం ఎవరు తెచ్చిండ్రో.. రైతులకు అండగ నిలబడ్డది ఎవరో తేల్చుకుందాం రమ్మని సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. పార్లమెంట్లోనైనా, అసెంబ్లీలోనైనా చర్చకు తాము సిద్ధమని ప్రకటించారు. చర్చలకు ప్రధాని మోదీ వస్తరో.. కేసీఆర్ వస్తరో.. కేటీఆర్ వస్తరో.. కిషన్‌రెడ్డి వస్త్తరో.. ఎవరు వచ్చినా తేల్చుకుందామని సవాల్ విసిరారు. రైతుభరోసా పథకం విఫలమవుతుందని కొందరు ఎదురుచూశారని, కానీ తొమ్మిది రోజులల్లోనే రైతుభరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమచేశామని చెప్పారు. ఎంత వరి పండించినా, చివరి గింజ వరకు కొని బోనస్ ఇస్తామని చెప్పి, హామీ నెరవేర్చామని పేర్కొన్నారు. రైతు సంక్షేమ ప్రభుత్వం అంటే ఎలా ఉండాలో చేసి చూపించామని తెలిపారు.