Revanth Reddy | టీ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మరోసారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై మరోసారి తన అక్కసును వెళ్లగక్కారు. సమైక్య రాష్ట్రంలోనే బాగుందని.. తెలంగాణ రాష్ట్రం అవసరమే లేదంటూ తన వైఖరిని మరోసారి బయటపెట్టారు. సమైక్య పాలనలో తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో తీవ్రమైన అన్యాయానికి గురైంది. ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తూ యావత్ ప్రజానీకం రాష్ట్రం కోసం ఉద్యమించి సాధించుకున్నారు. రాష్ట్రం కోసం జరిగిన పోరాటంలో ఎందరో విద్యార్థులు అసువులు బాశారు. సాధించుకున్న తెలంగాణ ప్రస్తుతం అన్నిరంగాల్లో నాటి ఉద్యమ నేత అయిన సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్నిరంగాల్లో ముందుకెళ్తున్నది.
అయితే, ఇది గిట్టని రేవంత్‌రెడ్డి తెలంగాణ అవసరం లేదని, సమైక్య రాష్ట్రమే బాగుందంటూ అమరవీరుల తాగ్యాలను అవమానించారు. ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు ఎప్పుడూ నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఆలోచన చేయలేదన్నారు. నీళ్లే కావాలంటే సీమాంధ్రులు నీళ్లు ఇవ్వలేదా? అంటూ ప్రశ్నించారు. నాగార్జున సాగర్, శ్రీశైలం, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి, ప్రాణహిత చేవేళ్ల, అర్ధాంతరంగా ఆగిపోయిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలు అప్పుడే ప్రారంభమయ్యాయి కదా అంటూ దబాయించారు. హైదరాబాద్ నగరంలో జరిగిన అభివృద్ధికి నిధులు కేటాయించారని.. నియామకాలు ఎనిమిది డీఎస్సీలు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చారన్నారు.
ప్రభుత్వ నియామకాలు కాస్త వెనుకో ముందో జరుగుతూనే వచ్చాయని.. వాటి కోసమే అయితే తెలంగాణ అవసరమే లేదంటూ తన వైఖరిని మరోసారి బయట పెట్టారు. రేవంత్‌రెడ్డి తెలంగాణపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. ఇప్పటికే పలుమార్లు అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. అవహేళనగా, అవమానకరంగా మాట్లాడిన సందర్భాలు అనేక ఉన్నాయి. సమైక్య పాలనలో తీవ్రంగా నష్టపోయిన రైతాంగానికి తెలంగాణ ప్రభుత్వం 24 గంటల కరెంటు సరఫరా చేస్తుండగా.. మూడు గంటల విద్యుత్ చాలంటూ అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. రైతులను బిచ్చగాళ్లతో పోల్చారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న విద్యార్ళును బీరు, బిర్యానీలు తిని, తిన్నది అరిగే దాకా తిరిగే అడ్డామీది కూలీలాంటి వారంటూ విద్యార్థి నేతలపై నోరుపారేసుకున్నారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై యావత్ తెలంగాణ ప్రజలు మండిపడుతున్నారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.