అశ్వారావుపేట, డిసెంబర్ 22 : రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి 420 హామీలు ఇచ్చి.. ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా ప్రజాస్వామ్య విలువలకు పాతరేస్తున్నారని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాసంక్షేమం, అభివృద్ధిని మరిచి ప్రజలను వంచిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కావడిగుండ్లలో సోమవారం జరిగిన సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ విజయోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. ఓటు వేసి గెలిపించుకున్న సర్పంచ్‌లతో పని చేయించుకునే హక్కు ప్రజలకు ఉందని తెలిపారు. ప్రజా సమస్యలను సర్పంచ్‌లు, పాలకవర్గాలు సామాజిక బాధ్యతగా గుర్తించి పరిష్కరించాలని కోరారు.