బంజారాహిల్స్/హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): పోక్సో కేసులో నిందితునిగా ఉన్న కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌ను సీఎం రేవంత్‌రెడ్డి కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత బక్క జడ్సన్ సీఎం ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. పోక్సో కేసు నుంచి తప్పించేందుకు భగీరథ్‌ను సీఎం తన ఇంట్లోనే దాచిపెట్టారంటూ అనుమానం వ్యక్తంచేశారు. పోక్సో కేసు నమోదై ఐదు రోజులైనా ఇంతవరకు అరెస్టు చేయలేదని, బండి సంజయ్ ఒత్తిడితోనే సీఎం కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం ఇంటివద్దకు జర్నలిస్ట్‌లను వెంటపెట్టుకొని వచ్చిన బక్కజడ్సన్ పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైనే బైఠాయించి ఆందోళనకు దిగారు.
ఈ సందర్భంగా కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడటంతో పోలీసులు వెంటనే బక్క జడ్సన్‌ను అరెస్టుచేసి జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. జడ్సన్ అక్కడ కూడా తన ఆందోళన కొనసాగిస్తూ.. భగీరథ్‌ను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. భగీరత్‌ను సీఎం తన ఇంట్లో దాచిపెట్టినట్టు తెలిసిందని, అందుకే జర్నలిస్టులతో కలిసి రేవంత్‌రెడ్డి ఇంటి ముట్టడికి వచ్చానని జడ్సన్ చెప్పారు. తప్పుచేసిన నిందితుడిని అరెస్టు చేయకుండా.. ప్రశ్నించిన తనను అరెస్టు చేయడం దారుణమని అన్నారు. కొడుకు తప్పు చేస్తే మందలించి పోలీసులకు అప్పగించాల్సిన కేంద్రమంత్రి బండి సంజయ్ అతడికి వత్తాసు పలుకడం సిగ్గుచేటని, బాధిత బాలికపై తప్పుడు ప్రచారం చేయడం ద్వారా నేరస్తుడికి సహకరిస్తున్నాడని ఆరోపించారు. భగీరథను అరెస్టు చేసే వరకు ఆందోళన విరమించనని, పోలీసులు వదిలినా.. స్టేషన్ నుంచి బయటకు వెళ్లనని జడ్సన్ స్పష్టంచేశారు.