హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణ రాష్ర్టానికి రేవంత్‌రెడ్డి షార్ట్‌కట్ సీఎంగా మారా రు.. ఆయన తీసుకుంటున్న నిర్ణయాల్లో అనుభవరాహిత్యం, అపరిపక్వత కనిపిస్తున్నది‘ అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 16 నెలలు స్కామ్‌ల కాలంగా మారిందని దుయ్యబట్టారు. శనివారం ఆయన టీన్యూస్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలపై మాట్లాడారు. సర్కారు అవలంబిస్తున్న వైఖరిపై ప్రజల్లో విశ్వాసం కొరవడిందని నిప్పులు చెరిగారు.
మంత్రులు డబ్బులు తీసుకుని పనులు చేస్తారన్న ఒక మంత్రి చేసిన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా, వ్యూహాత్మకంగా ఉన్నాయని తెలిపారు. హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలును అటకెక్కించి, అందాల పోటీలు నిర్వహించడాన్ని తప్పుబట్టారు. ఈ పోటీల వల్ల రాష్ర్టానికి ఎలాంటి మేలు కలిగిందో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని, నగరం బ్రాండ్ ఇమేజ్ పడిపోయిందని ధ్వజమెత్తారు. సీఎం, మంత్రుల మధ్య సమన్వయం కొరవడిందని, మంత్రులు రెండు వర్గాలుగా చీలిపోయారని గుసగుసలాడుతున్నారని చెప్పారు.
ప్రాజెక్టు విధానాల అమలు బాధ్యత పాలకులదే
ప్రాజెక్టుల నిర్మాణాల విషయంలో విధానాలను పాలకులు అమలు చేస్తారని, డిజైన్ మాత్రం అధికారులు, ఇంజినీర్లు చేస్తారని నిరంజన్‌రెడ్డి చెప్పారు. కాళేశ్వరం అనేది ప్రాజెక్టుల సముదాయమని, దాని కింద మూడు ప్రాజెక్టులు ఉన్నాయని, ప్రస్తుత పంటలకు ఈ నీళ్లే ఆధారమని తెలిపారు. అలాంటి ప్రాజెక్టుల నిర్మాణాల్లో కేసీఆర్ ముఖ్య భూమిక పోషిస్తే.. తప్పెలా అవుతుందని నిరంజన్‌రెడ్డి నిలదీశారు.