హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ) : టికెట్లు, ప్రకటనల ద్వారా వచ్చిన ఆదాయాన్ని మెట్రో నిర్వహణకు వినియోగించాల్సి ఉంటుందని, అయితే రేవంత్రెడ్డి సర్కార్ ఈ మొత్తాన్ని రుణాలకు చెల్లిస్తామనడంతోనే ఈ ప్రాజెక్టుకు లోన్ ఆగిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణను తాను అడ్డుకుంటున్నట్టు సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఈ మేరకు ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిషన్రెడ్డి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా అన్ని మెట్రోలు తీసుకున్న అప్పులను ముందే చెల్లించరని, మెట్రో ఆదాయంలో ఆపరేషన్స్, మెయింటెనెన్స్కు ఖర్చు చేయాలని స్పష్టంచేశారు. ఆ తర్వాతే రుణాలు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు.
ముందుగా లోన్ కట్టడంపై ఆలోచన చేయాలని సీఎంకు సూచించానని, అయితేనే మెట్రో మనుగడ సాగించగలదని చెప్పానని పేర్కొన్నారు. మెట్రో రుణాల విషయంలో కేంద్ర ప్రభుత్వం చేసిన సూచనలను సీఎం రేవంత్రెడ్డి అంగీకరించడం లేదని తెలిపారు. ఈ అంశాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, విమర్శల ద్వారా సమస్య పరిష్కారం కాదని చురకలు అంటించారు. తమ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నంలో భాగంగానే సీఎం రేవంత్ తాము అడ్డుకుంటున్నట్టు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర మంత్రి కట్టర్తో సమావేశానికి సీఎం రేవంత్ ఎప్పుడు వచ్చినా ఆయనతో పాటు తాను వెళ్తానని చెప్పారు.