గజ్వేల్, అక్టోబర్ 4 : ‘నల్లమల పులి అని చెప్పుకొంటున్న రేవంత్‌రెడ్డి.. నువ్వు పులివి కాదు.. రంగులు మార్చే ఊసరవెల్లివి’ అని బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు అన్నారు. అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డి గ్యారెంటీలకు గోరీలు కట్టి, బాండ్ పేపర్లను బొంద పెట్టిండని విమర్శించారు. ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని వంద మందికి డ్రిల్లింగ్ మెషిన్లను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు అలీ మస్కత్ సౌజన్యంతో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణలో కాలం తెచ్చిన కరువు కాదని.. కాంగ్రెస్ తెచ్చిన కరువని మండిపడ్డా రు. కేసీఆర్ రైతుల సాగునీటి కష్టాలు తీర్చేందుకు కొండపోచమ్మ, మల్లన్నసాగర్ ప్రాజెక్టులు, చెక్‌డ్యామ్‌లు నిర్మించి కాలువల ద్వారా ప్రతి ఎకరాకూ నీళ్లు అందించిన విషయాన్ని గుర్తుచేశారు.
కన్నెపల్లిలో కట్క ఒత్తితే నీళ్లు మల్లన్నసాగర్‌లోకి నీళ్లు దుంకుతాయని తెలిపారు. గోదావరిలో పారుతున్న నీళ్లను ఎత్తలేని దుస్థితిలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఉన్నదని విమర్శించారు. మల్లన్నసాగర్ రైతుల పక్షాన రెండు రోజులు దొంగ దీక్షలు చేసి.. అధికారంలోకి వస్తే పరిహారం డబుల్ ఇస్తామని చెప్పి ఇప్పుడు ఆ గ్రామాల వైపు చూసిన దాఖలాలు లేవని మండిపడ్డారు. పెండింగ్‌లో ఉన్న ఐదు-పదిశాతం బకాయిలను చెల్లించకుండా ఎట్లా హైదరాబాద్‌కు నీళ్లను తీసుకుపోతావో చూస్తామని హెచ్చరించారు. ‘కన్నెపల్లిలో కట్క ఒత్తితే రైతులకు నీళ్లు కనిపిస్తాయి.. కేసీఆర్ గుర్తుకొస్తాడు, పండించిన పంటలకు కొనాల్సి వస్తది. యూరియా ఇవ్వాల్సి వస్తది’ అని భయపడి రేవంత్‌రెడ్డి రైతులకు నీళ్లియ్యకుండా ద్రోహం చేస్తున్నాడని విమర్శించారు. రాష్ట్రం లో కల్యాణలక్ష్మీ చెక్కుల కోసం రెండు లక్షల మంది ఎదురుచూస్తున్నారని తెలిపారు.
కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మైనారిటీల బడ్జెట్ రూ.300 కోట్లు ఉంటే కేసీఆర్ దానికి రూ.1,800 కోట్లకు తీసుకొస్తే రేవంత్‌రెడ్డి మాత్రం తగ్గించి రూ.1,300 కోట్లకు తెచ్చారని దుయ్యబట్టారు. అధికారంలోకి వస్తే రూ.4 వేల కోట్ల బడ్జెట్ ఇస్తామంటూ అబద్ధ్దాలు పలికారని ధ్వజమెత్తారు. తుర్కకాశీ, మైనారిటీ ముస్లింలకు కార్పొరేషన్లో ఉన్న రూపాయి కూడా లబ్ధి చేకూరడం లేదని విమర్శించారు. మూడేండ్లలో అన్ని వర్గాలకు మోసం చేసిన ఘనత కాంగ్రెస్‌కు దక్కుతుందని అన్నారు. మూడేండ్లలో మైనారిటీలకు కాంగ్రెస్ ఇచ్చింది రూ.14 కోట్లు మాత్రమేనని స్పష్టంచేశారు. మైనారిటీ కార్పొరేషన్లో ఏడు నెలలుగా జీతాలు లేవని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వీ యాదవరెడ్డి, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, ఎంఎన్ శ్రీనివాస్, బడే సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.