హైదరాబాద్, డిసెంబర్ 22(నమస్తే తెలంగాణ) : కేసీఆర్ లెక్కలు సహా వివరించిన తీరు సీఎం రేవంత్‌రెడ్డికి తీవ్ర చిక్కులు తెచ్చిపెట్టింది. నోటికి ఏదొస్తే అది మాట్లాడే నైజానికి అలవాటుపడిన సీఎం, ఉద్యమనేత టైమ్లీగా కొట్టిన దెబ్బతో తీవ్ర అసహనానికి గురైనట్టు తెలుస్తున్నది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రెస్‌మీట్‌తో సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర కలవరపాటుకు గురై అప్పటి నుంచి తీవ్ర ఫ్రస్ట్రేషన్ (అసహనం)లో ఉన్నట్లు మీడియా వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతున్నది. కేసీఆర్ లెక్కలతో నిలదీతకు రేవంత్ ముఖమంతా పాలిపోయి అప్పటికప్పుడు కౌంటర్ ఇచ్చేందుకు ఆదివారం రాత్రే అనుకూల మీడియాను ఇంటికి పిలిపించుకొని చిట్‌చాట్ చేసిన విషయం తెలిసిందే.
అక్కడికెళ్లిన ‘ఆ మీడియా’ ప్రతినిధులకు సీఎం తీవ్ర అసహనంతో ఉన్నట్టు ఇట్టే అర్థమైంది. ఆయన మాటలు, హావభావాలు, చివరికి విలేకరులు అడిగిన ప్రశ్నలను కూడా జీర్ణించుకోలేని ఆయన అసహనం స్పష్టంగా కనిపించింది. విలేకరులు ప్రశ్నలు అడగడంపైనా ఆయన చికాకు పడినట్టు, కొన్ని సందర్భాల్లో వారిపై చిందులు వేసినట్టు తెలుస్తున్నది. ఒకానొక సందర్భంలో సీఎం రేవంత్‌రెడ్డి ఇటు కేసీఆర్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక, అటు చిట్‌చాట్‌లో విలేకరులు అడిన ప్రశ్నలకూ బదులు చెప్పలేక ఉక్కిరిబిక్కిరి అయినట్టు ఆ బృందంలోని వారే మాట్లాడుకోవడం వినిపించింది. అనుకూల మీడియాను పిలుపించుకున్నా సీఎం రేవంత్‌రెడ్డికి భంగపాటు తప్పలేదనే చర్చ విస్తృతంగా జరుగుతున్నది.