పెద్దపల్లి, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీలో బానిసలకే సముచిత స్థానం ఉంటదని, ఆత్మగౌరవం గల నాయకులకు మనుగడ లేదని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ ముఖ్యనేత, ఓదెల జడ్పీటీసీ గంటా రాములు విమర్శించారు. ఆత్మగౌరవం లేని ఆ పార్టీలో తాను కొనసాగేది లేదని తేల్చిచెప్పారు. రేవంత్‌రెడ్డి అహకారంతోనే బీసీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రెండుసార్లు ఓడిపోయిన తుమ్మల నాగేశ్వర్రావును ఇంటికెళ్లి ఆహ్వానించిన రేవంత్.. పొన్నాలను మాత్రం సిగ్గుండాలా? అని తులనాడటం బీసీలపై ఆయనకున్న చులకన భావానికి నిదర్శనమని పేర్కొన్నారు.
మంగళవారం పెద్దపల్లిలో ముఖ్యకార్యకర్తలతో కలిసి రాములు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధిష్ఠానం, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయాల్లో చురుగ్గా లేని మండవ వెంకటేశ్వర్రావు, కసిరెడ్డి నారాయణరెడ్డిని వాళ్ల ఇండ్లకు వెళ్లి ఆహ్వానించిన రేవంత్‌రెడ్డి.. ఒక బీసీ నేత.. 40 ఏండ్లు కాంగ్రెస్‌కు సేవచేసిన విద్యావంతుడు పొన్నాల లక్ష్మయ్యను మాత్రం సిగ్గుండాలా? అని అగౌరవపరిచేలా మాట్లాడి.. తుమ్మల దగ్గర ఒక నీతి.. పొన్నాల పట్ల మరోనీతి ప్రదర్శించారని దుయ్యబట్టారు. ఎన్నో ఏండ్ల నుంచి కాంగ్రెస్‌లో కొనసాగుతున్న తాను.. రూ.50 వేలు చెల్లించి టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నానని, తనతోపాటు మరో 80 మంది బీసీ నాయకులు పార్టీ పెద్దలను కలిసేందుకు ఐదు రోజులు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఎదురుచూసినా అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఆరోపించారు. త్వరలోనే తన కార్యాచరణను ప్రకటిస్తానన్నారు.