హైదరాబాద్, సెప్టెంబర్ 25(నమస్తే తెలంగాణ): ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారుల ఎంపిక కోసం దసరా పండుగ నాటికి ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. గ్రామ, వార్డు, మండల, పట్టణ, నియోజకవర్గ, జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటుకు విధివిధినాలను ఒకట్రెండు రోజుల్లో రూపొందించాలని సూచించారు. అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు దకాలని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై సచివాలయంలో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన నుంచి ఇతర రాష్ర్టాలు లక్షల సంఖ్యలో గృహాలు మంజూరు చేయించుకుంటే తెలంగాణ వెనుకబడిందని, ఈ దఫా కేంద్రం మంజూరు చేసే గృహాల్లో గరిష్ఠంగా రాష్ర్టానికి ఇండ్లు సాధించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పీఎంఏవై కింద రాష్ర్టానికి రావాల్సిన బకాయిలను రాబట్టాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో డాటాను ఎప్ప టికప్పుడు అప్డేట్ చేయాలని చెప్పారు. పెద్ద సంఖ్యలో ఇండ్ల నిర్మాణం ప్రారంభిస్తే ఇంజినీరింగ్ సిబ్బంది సమస్య ఎదురయ్యే పరిస్థితి ఉంటుందని అధికారులు తెలపగా అవసరమైతే ఔట్సోర్సింగ్ పద్ధతిన నియామకాలు చేపట్టాలని సూచించారు. రాజీవ్ స్వగృహలో నిరుపయోగంగా ఉన్న బ్లాక్‌లు, ఇండ్లను వేలం వేయాలని తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తయినా ఎందుకు అప్పగించ లేదని ప్రశ్నించారు. వెంటనే అర్హులకు ఇండ్లను అప్పగించాలని చెప్పారు. హైదరాబాద్ నగరంలో నిరుపయోగంగా ఉన్న బ్లాక్‌లకు మౌలిక వసతులు కల్పించి, అర్హులైనవారికి అప్పగించాలని సూచించారు. సమావేశంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎం ప్రిన్సిపల్ కార్యదర్శి వీ శేషాద్రి, సీఎం కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధ ప్రకాశ్, తెలంగాణ గృహ నిర్మాణ సంస్థ ఎండీ వీపీ గౌతమ్ పాల్గొన్నారు.