హైదరాబాద్, మార్చి 30(నమస్తే తెలంగాణ) : వరి సాగుపై సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి బాగా పెరిగిపోయిందని, ఈ పరిస్థితుల్లో వరి సాగు తగ్గించి మిగతా పంటలు పండించాలని స్పష్టంచేశారు. ఈ మేరకు సోమవారం శాసనమండలి మీటింగ్ హాల్లో సీఎం రేవంత్ మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. వరి ఒక్కటే పరిష్కారం కాదని, రాష్ట్రంలో పంటల మార్పిడి జరుగాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు.
కందులు, పసుపు, మిర్చి, జొన్నకు మార్కెట్ ఉంటుందో లేదోననే అభద్రతాభావంతో రైతులు ఆ పంటలు పండించడం లేదని తెలిపారు. సన్నబియ్యానికి బోనస్ ఇవ్వడం ద్వారా రైతులను దొడ్డు ధాన్యం పండించడం నుంచి సన్నధాన్యానికి మళ్లించినట్టు చెప్పారు.
సన్నబియ్యం పంపిణీకి ఏడాది పూర్తయిందని చెప్పారు. ఎన్టీఆర్ రూ.2కిలో రేషన్ బియ్యం పథకం ప్రారంభించిన తర్వాతే పేదవాళ్లు తెల్ల బియ్యంతో అన్నం తినే పరిస్థితి మొదలైందని చెప్పుకొచ్చారు. నిజానికి ఎన్టీఆర్ కన్నా ముందే కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఈ పథకం ప్రారంభించినా అది ప్రాచుర్యంలోకి రాలేదని తెలిపారు. ఇక రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, ప్రస్తుతం రాష్ట్రంలోని 86 శాతం మందికి రేషన్‌కార్డులు ఉన్నాయని చెప్పారు. త్వరలోనే 100 శాతం మందికి రేషన్ కార్డులు ఇస్తామని తెలిపారు.